Pakistan: కరోనా నుంచి బయటపడిన ఆరుగురు పాక్ ఆటగాళ్లు.. నేడో, రేపో ఇంగ్లండ్ పయనం!

  • రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ నెగటివ్
  • నలుగురికి మాత్రం రెండోసారి కూడా కరోనా నిర్ధారణ
  • ప్రైవేటు ఆసుపత్రిలో టెస్టు చేయించుకున్న హఫీజ్‌పై పీసీబీ ఆగ్రహం
6 pak team members tested corona negative

కరోనా బారినపడిన పది మంది పాక్ ఆటగాళ్లకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి నెగటివ్ వచ్చినట్టు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో వీరు త్వరలోనే ఇంగ్లండ్ వెళ్లి జట్టుతో కలవనున్నారు. నెగటివ్ ఫలితాలు వచ్చిన వారిలో ఫఖర్ జమాన్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ రిజ్వాన్, షాదాబ్ కాన్, వాహబ్ రియాజ్‌లు ఉన్నారు. వీరికి నాలుగు రోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లోనూ నెగటివ్ ఫలితాలే వచ్చాయి.  కాగా, మిగతా నలుగురికీ పాజిటివ్ ఫలితాలే రావడంతో వారు స్వదేశంలోనే ఉండనున్నారు. రెండోసారి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారిలో ఇమ్రాన్ ఖాన్, కాషిఫ్ భట్టి, హైదర్ అలీ, హరీశ్ రవూఫ్ ఉన్నారు. వీరికి మాత్రం ఇంగ్లండ్ వెళ్లేందుకు అనుమతి లభించలేదు.

మరోవైపు, ఫలితాలు నెగటివ్ వచ్చిన ఆటగాళ్లలో ఒకడైన మహ్మద్ హఫీజ్‌కు తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడ పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఆ విషయం చెబుతూ ట్వీట్ చేసి పీసీబీ ఆగ్రహానికి గురయ్యాడు. గత నెల 26న పీసీబీ అతడికి రెండోసారి పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షల్లో నెగటివ్ రాగా, తాజాగా నిర్వహించిన పరీక్షల్లోనూ ఫలితాలు నెగటివ్‌గా రావడంతో ఇంగ్లండ్ వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

More Telugu News