తదుపరి చిత్రంలో రైతు పాత్రలో బాలకృష్ణ!

30-06-2020 Tue 17:14
Balakrishna to play farmer in his next
  • ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న బాలకృష్ణ 
  • బి.గోపాల్ దర్శకత్వంలో తదుపరి సినిమా 
  • రచన చేస్తున్న బుర్రా సాయిమాధవ్

ప్రస్తుతం బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం. బోయపాటి అంటేనే యాక్షన్ పాళ్లు ఎక్కువ. ఇక బాలయ్యతో కావడంతో ఇది హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఇక దీని తర్వాత తాను చేయబోయే చిత్రాన్ని కూడా బాలకృష్ణ అప్పుడే లైన్లో పెడుతున్నారు. ఇది ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ ప్రాజక్టు కేన్సిల్ అయిందంటూ ఇటీవల కొంత ప్రచారం జరిగినప్పటికీ, అదంతా ఒట్టిదేనని అంటున్నారు.

ఇక బి.గోపాల్ రూపొందించే చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. రైతు సమస్యల నేపథ్యంలో ఇది ఉంటుందట. దీనికి సంబంధించిన స్క్రిప్టు పని ప్రస్తుతం జరుగుతోంది. పవర్ ఫుల్ డైలాగులు రాసే బుర్రా సాయిమాధవ్ ప్రస్తుతం దీనికి పదునైన సంభాషణలను రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు మీద సాగుతున్నాయి. ఇందులో బాలకృష్ణ సరసన నటించే కథానాయికలు ఎవరన్నది త్వరలోనే వెల్లడవుతుంది.