మాస్కు ధరించలేదని ఒక దేశ ప్రధానికే జరిమానా వేశారు: 'బల్గేరియా ప్రధాని' ఉదంతాన్ని ప్రస్తావించిన మోదీ

30-06-2020 Tue 16:52
Modi speaks towards nation in the wake of second phase unlock
  • జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
  • బల్గేరియా ప్రధాని ఉదంతాన్ని ప్రస్తావించిన వైనం
  • కరోనాపై పోరాడుతూనే అన్ లాక్ 2.0లో ప్రవేశించామని వెల్లడి

ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వర్షాకాలం రావడంతో అనేక రకాల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, జలుబు, జ్వరం చుట్టుముడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు స్వీయ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కులు ధరించడం జీవితంలో ఓ భాగం అన్నంతగా పాటించాలని పిలుపునిచ్చారు.

 ఇప్పుడే వార్తల్లో చూశానని, ఓ దేశానికి ప్రధానమంత్రి మాస్కు ధరించలేదని ఆయనకు రూ.13 వేల జరిమానా విధించారని తెలిసిందని వెల్లడించారు. బల్గేరియా ప్రధాని బోయికో బోరిస్సావ్ మాస్కు లేకుండా ఓ చర్చిలో అడుగుపెట్టడంతో ఆయనపై జరిమానా విధించారు. ఈ విషయాన్నే మోదీ ప్రస్తావించారు. గ్రామ సర్పంచి అయినా, దేశ ప్రధాని అయినా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ తో లక్షల ప్రాణాలు కాపాడగలిగామని,  కరోనాతో పోరాడుతూనే ఇప్పుడు అన్ లాక్ 2.0 లో ప్రవేశించామని మోదీ వెల్లడించారు. ముఖ్యంగా భారత్ లో 130 కోట్ల మంది ఆరోగ్యంతో కూడిన అంశం కావడంతో నిబంధనలు పాటించడం అత్యావశ్యకం అని అన్నారు. నిబంధనలు పాటించనివారి ఆలోచనా దృక్పథంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు.  కంటైన్మెంట్ జోన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.