ఉద్యోగినిపై దాడి చేసిన టూరిజం అధికారిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు... డీజీపీ అభినందన

30-06-2020 Tue 14:16
  • కాంట్రాక్ట్ ఉద్యోగినిపై అధికారి దాడి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలన్న డీజీపీ
Police arrests Nellore tourism official and DGP appreciates SP
దివ్యాంగురాలు అని కూడా చూడకుండా ఓ మహిళా ఉద్యోగినిపై విచక్షణ రహితంగా దాడిచేసిన నెల్లూరు టూరిజం శాఖ డిప్యూటీ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ నెల్లూరు పోలీసులను అభినందించారు. ఈ ఘటనపై సత్వరమే స్పందించి, తగిన చర్యలు తీసుకున్నారంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ను ప్రశంసించారు. అంతేకాదు, ఈ కేసును దిశా పోలీస్ స్టేషన్ కు అప్పగించాలని, వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్పీని ఆదేశించారు.

నెల్లూరు జిల్లా టూరిజం శాఖ కార్యాలయంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగినిని ఓ డిప్యూటీ మేనేజర్ దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో కారణంగానే సదరు అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "మాస్కు ఎందుకు ధరించలేదు?" అని ఆ మహిళా ఉద్యోగిని ప్రశ్నించడమే డిప్యూటీ మేనేజర్ ను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది.