Jail: జైలు నుంచి విడుదలైన అరగంటలోనే.. మళ్లీ పాత మోసాలకి పాల్పడిన నిందితులు

Within half an hour of his release from jail once again cheated MLC
  • ఏ నేరంపై జైలుకెళ్లారో.. విడుదలైన తర్వాత మళ్లీ అదే నేరం
  • నిందితుల మాటలు నమ్మి అనుచరులతో రూ.8.25 లక్షలు ట్రాన్స్‌ఫర్
  • మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు
నేరం చేసి జైలు కెళ్లిన ఇద్దరు వ్యక్తులు విడుదలైన అరగంటకే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇప్పిస్తామంటూ పెద్దాపురానికి చెందిన తోట బాలాజీ నాయుడు (42), రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన మల్లిడి తాతారెడ్డి (33)లు ప్రముఖులను మోసం చేసి జైలుకెళ్లారు. శిక్ష ముగియడంతో శనివారం సాయంత్రం వీరు విశాఖపట్టణంలోని జైలు నుంచి విడుదలయ్యారు.
 
జైలు నుంచి విడుదలైన కాసేపటికే వీరిలో ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీకి, ఎమ్మెల్సీకి ఫోన్ చేశారు. తాను ఇండస్ట్రీస్ డిప్యూటీ సెక్రటరీనని పరిచయం చేసుకున్నాడు. రూ.50 లక్షల రుణం ఇప్పిస్తానని, అయితే, మార్జిన్ మనీగా తొలుత రూ. 1.25 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. అతడి మాటలు నమ్మేసిన ఎమ్మెల్సీ విషయాన్ని తన అనుచరులకు చెప్పారు. దీంతో హిందూపురం, చిలమత్తూరుకు చెందిన ఏడుగురు ఆ వ్యక్తి చెప్పిన ఖాతాలకు మొత్తం రూ.8.25 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు.

అయితే, అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్సీ ఆరా తీశారు. దీంతో విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చిన ఫోన్ నంబరు, డబ్బులు బదిలీ చేసిన ఖాతాల గురించి ఆరా తీయగా డబ్బులు జమ అయిన ఖాతా తాతారెడ్డిదని, ఎమ్మెల్సీకి ఫోన్ చేసింది అతడి మిత్రుడు బాలాజీ నాయుడని గుర్తించారు. వెంటనే ఆ ఖాతాను సీజ్ చేసిన పోలీసులు అందులో రూ.7.52 లక్షలు ఉన్నట్టు మాత్రమే గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Jail
Visakhapatnam District
Anantapur
MLC
MP

More Telugu News