కరోనా భయమంటే ఇదే... ముద్దులు, కౌగిలింతలకు బై చెప్పిన హీరోయిన్!

30-06-2020 Tue 08:21
Regina Says no Kiss and Hug Scenes as off Now
  • లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ
  • షూటింగ్స్ ప్రారంభమైనా నటీనటుల్లో ఆందోళన
  • శృంగార సన్నివేశాలు చేయబోనన్న రెజీనా కసాండ్రా

కరోనా మహమ్మారి ప్రతి రంగాన్నీ కుదేలు చేసింది. ముఖ్యంగా భారత చిత్ర పరిశ్రమ ఎంతో నష్టపోయింది. ఇప్పటికే మూడు నెలలకు పైగా షూటింగ్స్ లేక, థియేటర్లు మూతపడి, వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ తిరిగి మొదలవుతున్నా, కరోనా భయం మాత్రం ఎవరినీ వీడలేదు. ముఖ్యంగా భౌతికదూరం పాటించకుండా నటించాల్సిన హీరో, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న వేళ, తాను ఇకపై ముద్దులు, కౌగిలింతలు, శృంగార సన్నివేశాల్లో నటించబోనని హీరోయిన్ రెజీనా కసాండ్రా స్పష్టం చేసింది.

తాజాగా, ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ భామ, ఇకపై తాను నటించే సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ ఉండబోవని తెలిపింది. లిప్ లాక్ సన్నివేశాలు, కౌగిలింతలు, బెడ్ రూమ్ సీన్స్ లేకుంటేనే అంగీకరిస్తానని, అటువంటి సీన్స్ లో చేయాలంటే భయంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పింది. భవిష్యత్తులో అన్ని పరిస్థితులూ మారి, పాత రోజులు వస్తే మాత్రం అటువంటి సీన్లు చేయడానికి అభ్యంతరం లేదని చెప్పింది. ఇది రెజీనా భయం మాత్రమే కాదు. మిగతా హీరోయిన్లు అందరిలోనూ ఉన్న భయమేనంటే అతిశయోక్తి కాదేమో.