ఇరాన్ దుస్సాహసం.. ట్రంప్ అరెస్ట్ కు వారెంట్ జారీ!

29-06-2020 Mon 18:54
  • ఇరాన్ టాప్ కమాండర్ సులేమానీని హతమార్చిన అమెరికా బలగాలు
  • ట్రంప్ సహా మరో 30 మందిపై వారెంట్ జారీ
  • హత్య, ఉగ్రవాద అభియోగాలను మోపిన ఇరాన్
Iran issues arrest warrant to Donald Trump
ఎవరూ ఊహించని దుస్సాహసానికి ఇరాన్ తెగబడింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసింది. తమ టాప్ కమాండర్ ఖాసిం సులేమాని హత్యకు సంబంధించి ట్రంప్ ను అరెస్ట్ చేసేందుకు సహకరించాలని ఇంటర్ పోల్ ను కోరింది. కనీసం రెడ్ నోటీసునైనా జారీ చేయాలని విన్నవించింది. మరోవైపు ఈ అంశంపై స్పందించేందుకు ఇంటర్ పోల్ చీఫ్ లియోన్ నిరాకరించారు.

బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద సులేమానీని డ్రోన్ల ద్వారా అమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ట్రంప్ తో పాటు మరో 30 మంది పాత్ర ఉందని ఇరాన్ ప్రాసిక్యూటర్ అలీ తెలిపారు. ట్రంప్ సహా నిందితులపై హత్య, ఉగ్రవాద అభియోగాలను మోపినట్టు చెప్పారు. ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆయనను అరెస్ట్ చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. దీనిపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.