Aarogya Setu: తెలంగాణలో ఎంసెట్ రాయాలంటే 'ఆరోగ్యసేతు' తప్పనిసరి!

  • జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్
  • మార్గదర్శకాలు జారీ చేసిన టీఎస్ సీహెచ్ఈ
  • పరీక్షలు వాయిదా పడబోవని స్పష్టీకరణ
Aarogya Setu must for EAMCET aspirants in Telangana

తెలంగాణలో జూలై 6 నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంసెట్ పరీక్ష రాసే విద్యార్థులు ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుని, పరీక్షకు హాజరయ్యేముందే తమ ఆరోగ్యస్థితిని వెల్లడించాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేని విద్యార్థులు ఓ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రంపై సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీఎస్ సీహెచ్ఈ) జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈమేరకు పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రం ప్రవేశద్వారం వద్దే ఆయా విద్యార్థులు ఆరోగ్యసేతు యాప్ లో తమ ఆరోగ్యస్థితిని అక్కడి సెక్యూరిటీ గార్డుకు చూపాల్సి ఉంటుంది. ఒకవేళ జ్వరంతో బాధపడుతూ ఉన్నా, కరోనా లక్షణాలు ఉన్నా గానీ పరీక్ష రాసేందుకు సిద్ధపడితే వారికోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడంపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు చర్చిస్తున్నారు.

ఇక ఎంసెట్ పరీక్షలు వాయిదా పడతాయన్న ఊహాగానాలపై టీఎస్ సీహెచ్ఈ చైర్మన్ పాపిరెడ్డి స్పందిస్తూ, అవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. ఒక్కో పరీక్ష ముగిసిన తర్వాత ప్రతి సెంటర్ ను శానిటైజింగ్ చేస్తామని, విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని, వీలైనంత త్వరగా ఎంసెట్ అడ్మిషన్లు కూడా చేపట్టేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

More Telugu News