Iron Man: ఇస్త్రీ చేసే వ్యక్తికి బట్టల్లో దొరికిన రూ. 5 లక్షల బంగారం... భద్రంగా యజమానికి అప్పగించిన వైనం!

Wife and Husbend return Gold they found in Pant Pockets
  • ఉతికేందుకు బట్టలు ఇచ్చిన ఓ కుటుంబం
  • ఇస్త్రీ చేసే సమయంలో జేబులో బంగారం ఉన్న బాక్స్
  • తిరిగిచ్చిన వారిని ఘనంగా సత్కరించిన అధికారులు
రోడ్డుపై పది రూపాయల కాగితం కనిపించినా, భద్రంగా తీసుకుని జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో, తనకు దొరికిన రూ. 5 లక్షల విలువైన బంగారాన్ని క్షేమంగా యజమానికి చేర్చిన ఓ రజకుడు, ఉన్నతాధికారుల ప్రశంసలను అందుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం, తంగడపల్లిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, కేతరాజు నర్సింహ, మంజుల దంపతులు, దుస్తులు ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ గ్రామానికి చెందిన భద్రారెడ్డి - లక్ష్మీ దంపతులు కొన్ని దుస్తులను 26న ఉతికేందుకు వారికి ఇచ్చారు. ఆదివారం వాటిని ఇస్త్రీ చేస్తుంటే, ప్యాంటు జేబులో ఓ బాక్స్ ను మంజుల గుర్తించింది. దాన్ని తీసి చూడగా, అందులో 10 తులాల బంగారం ఉంది.

అయితే, దాన్ని తీసుకుని దాచుకోకుండా, భర్తతో కలిసి వెళ్లి విషయాన్ని స్థానిక కౌన్సిలర్ నాగరాజుకు చెప్పింది. వెంటనే స్పందించిన నాగరాజు, భద్రారెడ్డికి, పోలీసులకు విషయాన్ని తెలిపారు. తనకు దొరికిన బంగారాన్ని నిజాయతీగా దాని యజమానులకు అప్పగించగా, వారు ఈ దంపతులను ఘనంగా సత్కరించారు. పూలమాల, శాలువా కప్పి, విలువైన బట్టలు పెట్టారు. ఇప్పుడు నర్సింహ, మంజుల దంపతులను పలువురు అభినందిస్తున్నారు.
Iron Man
Gold
Nalgonda District
Cloths

More Telugu News