ఎస్ జానకి మరణించారంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ.. వీడియో విడుదల చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం!

29-06-2020 Mon 10:19
SPB Anger Video on Spreading Rumers on Janaki
  • జానకి మరణంపై వైరల్ అయిన వార్తలు
  • ఇటువంటి చెత్త రాతలేంటని ఎస్పీబీ ఆగ్రహం
  • తాను స్వయంగా మాట్లాడానని వెల్లడి

నిన్న రాత్రి ప్రముఖ గాయని ఎస్ జానకి మరణించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలపై గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఘాటుగా స్పందించారు. ఏంటీ చెత్త రాతలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదయం నుంచి తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయని, వారంతా జానకి గారికి ఏమైందని ప్రశ్నించారని తెలిపారు.

కొంతమంది ఏ మాత్రమూ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని, సినీ కళాకారుల ఫ్యాన్స్ కు ఇటువంటి వార్తలు వింటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటువంటిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తాను స్వయంగా జానకమ్మతో మాట్లాడానని వ్యాఖ్యానించిన ఎస్పీబీ, ఆవిడ చాలా బాగున్నారని అన్నారు.

సామాజిక మాధ్యమాలను ఫన్ కోసం, చెడు విషయాలను ప్రచారం చేయడం కోసం వాడవద్దని, పాజిటివిటీ కోసమే వాడాలని కోరారు. కాగా, జానకి ఆరోగ్యం బాగుందని వారి కుటుంబ సభ్యులు కూడా వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.