Amazon: 'వర్చువల్ కస్టమర్ సర్వీస్‌' విభాగంలో 20,000 మందిని నియమించుకోనున్న అమెజాన్

  • రానున్న 6 నెలల్లో డిమాండుకు అనుగుణంగా ఉద్యోగాలు
  • హైదరాబాద్‌, పూణె, కోయంబత్తూరు వంటి ప్రాంతాల్లో నియామకాలు
  • 'వర్చువల్ కస్టమర్ సర్వీస్‌'లో భాగంగా ఉద్యోగాలు
  • శాశ్వత ఉద్యోగాలకూ ఎంపిక చేసే అవకాశాలు
Amazon India to hire 20000 temporary staff

ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా దాదాపు 20,000 మందిని తాత్కాలికంగా ఉద్యోగాల్లో నియమించుకోనుంది. రానున్న ఆరు నెలల్లో వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరిగే అవకాశం ఉండడంతో హైదరాబాద్‌, పూణె, కోయంబత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నోల్లో ఈ నియామకాలు ఉంటాయని అమెజాన్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

'వర్చువల్ కస్టమర్ సర్వీస్‌'లో భాగంగా ఇంటి నుంచే పనిచేసే వీలును కల్పిస్తూ ఈ ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ-మెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ వంటి సాధనాల సాయంతో వారు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఇంగ్లిషుతో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ వంటి ఏదైనా ఒక ప్రాంతీయ భాషలో అభ్యర్థులు ప్రావీణ్యం కలిగి ఉండాలి.

తాత్కాలికంగా నియమించుకున్న వారిని.. ఉద్యోగుల సమర్థత, బిజినెస్‌ అవసరాల ఆధారంగా శాశ్వత ఉద్యోగాలకూ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇండియా తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండును బట్టి తాము ఉద్యోగులను నియమించుకుంటూనే ఉన్నామని చెప్పింది.

రానున్న ఆరు నెలల్లో కస్టమర్ల నుంచి డిమాండు బాగా వచ్చే అవకాశం ఉండడంతో ఉద్యోగులను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగులతో 6 నెలల పాటు వినియోగదారుల అవసరాలు తీర్చుతామని అమెజాన్‌ ఇండియా కస్టమర్స్ సర్వీస్ డైరెక్టర్ అక్షయ్‌ప్రభు తెలిపారు.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాము వేలాది మందికి ఉపాధి  కల్పిస్తున్నామని చెప్పారు. కాగా, 2025లోపు భారత్‌లో దాదాపు మిలియన్ కొత్త ఉద్యోగాల కల్పన కోసం ప్రణాళిక వేసుకున్నామని ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్‌ ఇండియా తెలిపింది.

టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్‌ నెట్‌వర్క్‌ రంగాల్లో పెట్టుబడులు పెడతామని తెలిపింది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. అప్పట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుని ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

More Telugu News