Telangana: హైదరాబాదులో మరోసారి లాక్ డౌన్ విధిస్తే ఏమైపోవాలి?: ప్రశ్నిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

  • రెండు వారాల వ్యవధిలో 8 సెట్ పరీక్షలు
  • లాక్ డౌన్ పై మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్న కేసీఆర్
  • పరీక్షలు రద్దయితే విద్యా సంవత్సరంపై ప్రభావం
  • విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన
Another Lockdown Will Impact Students Education

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, మరో విడత లాక్ డౌన్ విధించాలని సిఫార్సులు వస్తున్నాయని, ఈ విషయంలో మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా హైదరాబాద్ వాసుల్లో కలకలం రేపింది.

లాక్ డౌన్ విధిస్తే, అది జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుందని స్పష్టమవుతున్నా, దాని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక జూలై 1 నుంచి 15వ తేదీలోపు పీజీ ఈసెట్, ఈసెట్, ఎంసెట్ తదితర 8 సెట్ పరీక్షలు జరుగనున్నాయి. వీటి కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది.

లాక్ డౌన్ విధిస్తే, పరీక్షలన్నీ రద్దు చేయక తప్పనిసరి. ముఖ్యంగా 6 నుంచి 9 వరకూ ఎంసెట్ జరుగనుండగా, ఈ దఫా రికార్డు స్థాయిలో 2.21 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం పాలీసెట్, ఆపై లాసెట్, ఐసెట్, ఎడ్ సెట్, పీఈ సెట్ తదితరాలన్నీ 15 లోపే జరగనున్నాయి. తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ పరీక్షా కేంద్రాలున్నా, హైదరాబాద్ లో పరీక్షలు రద్దు చేసి, మిగతా చోట్ల పరీక్షలు జరిపించే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జామ్స్ జరగకుంటే, తదుపరి విద్యా సంవత్సరంపై ప్రభావం పడి తీరుతుందని తల్లిదండ్రులు అంటున్నారు. తమ పిల్లలంతా ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇప్పటికే తమ వ్యాపారాలను కోల్పోయిన ఎంతో మంది చిన్న వ్యాపారులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సుమారు రెండు నెలల తరువాత చిరుతిళ్ల దుకాణాలు, టిఫిన్ బండ్లు, వీధి వ్యాపారులు రోడ్లపైకి రాగా, మరోసారి లాక్ డౌన్ విధిస్తే కనుక అది వారి ఆర్థిక స్థితిపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుంది. తెరచుకున్న రెస్టారెంట్లు, మాల్స్ తిరిగి మూసేయాల్సి వుంటుంది. పరిశ్రమలు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయమై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

More Telugu News