Harley Devidson: హార్లీ డేవిడ్ సన్ హైఎండ్ బైక్ పై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే!

  • నాగపూర్ లో వీకెండ్ గడిపిన సీజేఐ
  • లిమిటెడ్ ఎడిషన్ గా విడుదలైన సీవీఓపై సందడి
  • నెటిజన్ల మనసు దోచుకున్న చిత్రాలు
CJI SA Bobde on Hiend Bike Pics goes Viral

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే, నాగపూర్ లో కాస్తంత సేదదీరారు. సుప్రీంకోర్టుకు 47వ చీఫ్ జస్టిస్ గా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఆయన, బైక్ లపై తనకున్న ప్రేమను మరోసారి చాటి చెప్పారు. హార్లీ డేవిడ్ సన్ హైఎండ్ బైక్ ఎక్కారు.

ఈ బైక్ మోడల్ 'సీవీఓ'. ఇటీవల ఈ బైక్ ను లిమిటెడ్ ఎడిషన్ గా సంస్థ విడుదల చేసింది. దీని ధర రూ. 50.83 లక్షలు. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెట్టింట వైరల్ అయి, నెటిజన్ల మనసును గెలుచుకున్నాయి. ఎస్ఏ బాబ్డే బైక్ పై కూర్చున్న చిత్రాలను పోస్ట్ చేస్తున్న పలువురు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.

"ఈ బైక్ ఉన్నది మన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే... వీకెండ్ లో నాగపూర్ లో ఇలా కనిపించారు" అని ఒకరు, "బైక్ లపై తనకున్న ప్రేమను బాబ్డే మరోసారి చూపించారు" అని మరొకరు, "సీజేఐ బాబ్డే చాలా వేగంగా వెళ్లగల బైక్ పై ఉన్నారు. మనం కూడా వేగంగా న్యాయాన్ని ఆశించవచ్చా?" అని ఇంకొకరు కామెంట్లు పెట్టారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి, కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ తరుణంలో మాస్క్ లేకుండా బైక్ పై కనిపించడాన్ని ప్రశ్నించారు కూడా.

కాగా, చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకోకముందు, తీసుకున్న తరువాత బాబ్డే పలు కీలక తీర్పులను వెలువరించిన బెంచ్ లలో న్యాయమూర్తిగా వున్నారు. నవంబర్ 9, 2019న వెలువడిన అత్యంత కీలక రామ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసుతో పాటు, 2016లో ఢిల్లీలో దీపావళి బాణసంచాపై నిషేధం వంటి కేసుల్లో తీర్పులను వెలువరించారు. సీజేఐగా గొగొయ్ విధుల్లో ఉన్న సమయంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాగా, విచారించిన కమిటీలో సభ్యులుగానూ పనిచేశారు.

కాగా, తనకు బైక్ లంటే ఎంతో ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాబ్డే వెల్లడించారు. గత సంవత్సరం హార్లీ డేవిడ్ సన్ కే చెందిన ఓ బైక్ ను టెస్ట్ రైడ్ కు తీసుకెళ్లిన ఆయన, ప్రమాదంలో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన ద్విచక్ర వాహనాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

More Telugu News