Sanjaya Baru: ఆన్ లైన్ మద్యం పేరిట మోసపోయిన మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు

  • మద్యం డోర్ డెలివరీకి ప్రయత్నించిన సంజయ బారు
  • ఆన్ లైన్ లో రూ.24 వేలు బదిలీ
  • అవతలి వ్యక్తి ఫోన్ స్విచాఫ్
Ex PM Manmohan Singh former media adviser Sanjaya Baru was cheated for online liquor

దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.  ఇంటి వద్దకే మద్యం అందించే సంస్థలు ఏవైనా ఉన్నాయేమోనని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన ఓ మాజీ అధికారి నిలువునా మోసపోయాడు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు గతంలో మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ బారు ఆన్ లైన్ లో మద్యం అమ్మకందార్ల గురించి నెట్ లో వెదికారు. లా కేవ్ వైన్స్ అండ్ స్పిరిట్స్ పేరిట ఓ నెంబర్ దొరకడంతో ఫోన్ చేసి ఇంటి వద్దకే మద్యం సరఫరా చేయాలని కోరారు. అవతల ఫోన్ ఎత్తిన వ్యక్తి రూ.24 వేలు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరాడు. నిజమేనని నమ్మిన సంజయ బారు ఆ వ్యక్తి చెప్పినంత డబ్బు ఆన్ లైన్ లో బదిలీ చేశారు. అంతే, ఆ మరునిమిషమే అవతలి వ్యక్తి ఫోన్ స్విచాఫ్ అయింది.

మద్యం ఎంతకీ డోర్ డెలివరీ ఇవ్వకపోవడంతో లా కేవ్ వైన్స్ అండ్ స్పిరిట్స్ ఫోన్ నెంబర్ కు ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో మోసపోయానని గ్రహించిన సంజయ బారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఓ క్యాబ్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. తమదైన శైలిలో విచారణ చేయగా, ఆ క్యాబ్ డ్రైవర్ విషయాలన్నీ చెప్పేశాడు.

మారుపేర్లతో సిమ్ కార్డులు తీసుకుని ఇలాంటి మోసాలు చేస్తుంటామని వెల్లడించాడు. అంతేకాదు, అనేక రాష్ట్రాల్లో పలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, ఒక్కసారి డబ్బు అకౌంట్ లో పడిందంటే, 10 నిమిషాల వ్యవధిలో ఆ సొమ్మును అనేక అకౌంట్లలోకి మార్చేస్తామని తెలిపాడు. కాగా, ఈ ఘటనలో మోసపోయిన సంజయ బారు... గతంలో మన్మోహన్ సింగ్ పై ఓ పుస్తకం రాసి సంచలనం సృష్టించారు. ఆ పుస్తకం పేరు 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. రాజకీయ వర్గాల్లో ఈ పుస్తకం బాగా చర్చనీయాంశం అయింది.

More Telugu News