Jakkampudi Raja: పవన్ డ్యాన్సులు, డైలాగులతో ఆకర్షితులైన కాపు యువత సొంత డబ్బు ఖర్చు చేసుకున్నారు: జక్కంపూడి రాజా

Jakkampudi Raja responds on Pawan Kalyan comments
  • కాపులకు జరిగిన అన్యాయాలపై పవన్ ప్రశ్నించలేదన్న రాజా
  • ముద్రగడ విషయంలోనూ పవన్ ఏమీ మాట్లాడలేదని ఆరోపణ
  • కాపులు పవన్ ను విశ్వసించలేదని వ్యాఖ్యలు
ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ డ్యాన్సులు, డైలాగులకు కాపు యువత ఆకర్షితులయ్యారని, తమ సొంత డబ్బు ఖర్చు చేసి కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. కానీ, పవన్ కల్యాణ్ నాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని భుజాలపై మోసేందుకు ప్రయత్నించారు తప్ప కాపులకు జరిగిన అన్యాయాలపై ప్రశ్నించలేదని అన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ పాలనలో రూ.1600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అంత తక్కువ ఖర్చు చేయడంపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదని జక్కంపూడి రాజా నిలదీశారు. కాపు రిజర్వేషన్ల గురించి అడిగిన ముద్రగడ పద్మనాభంతో పాటు వేలమందిపై కేసులు పెట్టారని, అప్పుడు కూడా పవన్ ప్రశ్నించలేదని అన్నారు. ప్రశ్నించేందుకే వచ్చానంటూ 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పవన్ గత ఐదేళ్లలో ఏం ప్రశ్నించారు? అంటూ మండిపడ్డారు. అందుకే 2019 ఎన్నికల్లో పవన్ పార్టీని ప్రజలు ఒక సీటుకు మాత్రమే పరిమితం చేశారని తెలిపారు. కాపులు కూడా విశ్వసించలేదన్న విషయాన్ని పవన్ గుర్తెరగాలని జక్కంపూడి రాజా హితవు పలికారు.
Jakkampudi Raja
Pawan Kalyan
Kapu
Janasena
Chandrababu
Andhra Pradesh

More Telugu News