tomato: డిమాండ్‌కు సరిపడా లేని సరఫరా.. రూ.50 దాటిన కిలో టమాటా

  • హైదరాబాద్‌లో రోజుకు సగటున 6 వేల క్వింటాళ్ల వినియోగం
  • అన్‌లాక్ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చిన ధరలు
  • మరో రెండు నెలలు ధరలు ఇలానే ఉంటాయంటున్న వ్యాపారులు
Tomato price hike in Telangana due to unlock

టమాటా ధర మళ్లీ కొండెక్కింది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో  వారం క్రితం వరకు రూ.30 ఉన్న కిలో టమాటా ధర ఇప్పుడు రూ. 50 పలుకుతోంది. కొత్త సాగు వచ్చేందుకు మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ధరలు ఇలానే ఉంటాయని వ్యాపారులు అంటున్నారు. తెలంగాణలోని మెదక్, వికారాబాద్‌లలో ఎక్కువగా టమాటాను సాగు చేస్తారు. హైదరాబాద్ మార్కెట్లకు ఇక్కడి నుంచే టమాటా సరఫరా అవుతూ ఉంటుంది. రోజుకు దాదాపు 800 క్వింటాళ్ల వరకు ఇక్కడికి వస్తుంది.

అయితే, నగరంలో టమాటా దినసరి సగటు వినియోగం 6 వేల క్వింటాళ్ల వరకు ఉంటుంది. డిమాండ్ నేపథ్యంలో ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, చిక్‌మంగళూరు నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటారు.

లాక్‌డౌన్ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయడంతో టమాటాకు గిరాకీ తగ్గుతూ వచ్చింది. అప్పట్లో కిలో గరిష్టంగా పది రూపాయలకు విక్రయించారు. అన్‌లాక్ మొదలైన తర్వాత క్రమంగా పెరిగిన టమాటా ధర నిన్న మొన్నటి వరకు రూ. 30 పలికింది. ఇప్పుడు ఏకంగా రూ. 50కు చేరుకోవడంతో వినియోగదారులు టమాటా వైపు చూడాలంటే భయపడుతున్నారు.

More Telugu News