ఆర్మాక్స్ మీడియా సర్వే... టాలీవుడ్ నంబర్ వన్ బన్నీ... 9వ స్థానంలో రామ్ చరణ్!

28-06-2020 Sun 07:01
Tollywood Heros Ranks by Ormax Media
  • రెండో స్థానంలో మహేశ్, ఆపై ప్రభాస్
  • రామ్ చరణ్ కన్నా ముందు విజయ్ దేవరకొండ, నాని
  • సంబంధం లేని వారితో సర్వే నిర్వహించారంటూ విమర్శలు

టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో ఎవరు? ఈ  ప్రశ్నకు పదేళ్ల క్రితం వరకూ ఒకే పేరు వినిపించేది. అది మెగాస్టార్ చిరంజీవి. ఆ తరువాత బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల పేర్లు ఆటూ ఇటూ తిరుగుతూ ఉండేవి. కానీ, ఇప్పుడు నంబర్ వన్ ఎవరంటే చాలా కష్టమైన ప్రశ్నే. కానీ, ఆర్మాక్స్ మీడియా ఓ సర్వేను నిర్వహించి, టాలీవుడ్ లో నంబర్ వన్ హీరో అల్లు అర్జున్ అని, ఆ తరువాత రెండో స్థానంలో మహేశ్ బాబు, మూడో ప్లేస్ లో ప్రభాస్ ఉన్నారని పేర్కొంది.

ఆ తరవాత నాలుగో స్థానంలో పవన్ కల్యాణ్, ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, ఆరో స్థానంలో చిరంజీవి, ఏడో స్థానంలో విజయ్ దేవరకొండ, ఎనిమిదో ప్లేస్ లో నాని, 9వ ప్లేస్ లో రామ్ చరణ్, 10వ స్థానంలో వెంకటేశ్ ఉన్నారని పేర్కొంది. ఆర్మాక్స్ మీడియా సర్వేను చూసిన వారంతా ఇప్పుడు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. టాలీవుడ్ తో ఏ మాత్రమూ సంబంధం లేని వారితో ఈ సర్వేను రూపొందించి వుంటారని అంటున్నారు. తెలుగు సినిమాలు, హీరోల స్టామినా, వారి ఫ్యాన్ ఫాలోయింగ్ వివరాల గురించి తెలియని వారు సర్వేలో పాల్గొని వుంటారని అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి ఈ సంవత్సరం ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అతిపెద్ద హిట్స్. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఈ సంవత్సరంలోనిది కాదు. సాహో కన్నా ముందు అతను బాహుబలి-2లో కనిపించారు. ప్రభాస్, హిందీ మాట్లాడే వారికి కూడా బాహుబలి చిత్రాలతో సుపరిచితుడు అయ్యాడనడంలో సందేహం లేదు. కానీ, రామ్ చరణ్ ర్యాంకు విజయ్ దేవరకొండ, నానీల తరువాత ఉండటాన్ని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా, ఆర్మాక్స్ మీడియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలావుండగా, తెలుగు హీరోయిన్ల ర్యాంకులను కూడా ప్రకటించిన ఆర్మాక్స్ మీడియా, తొలి స్థానంలో సమంత ఉందని తేల్చింది. ఆ తరువాత వరుసగా కాజల్ అగర్వాల్, అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, రష్మికా మందన్నా టాప్ 5లో నిలిచారు.