పతంజలి 'కరోనా ఔషధం'పై రంగంలోకి పోలీసులు... రామ్ దేవ్ బాబా సహా ఐదుగురిపై ఎఫ్ఐఆర్!

28-06-2020 Sun 06:49
FIR Registered on Ramdev and 4 Others on False Claims
  • క్లినికల్ ట్రయల్స్ జైపూర్ నిమ్స్ లో నిర్వహించామన్న రామ్ దేవ్
  • నిమ్స్ చైర్మన్, డైరెక్టర్ లపై ఎఫ్ఐఆర్
  • పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణపై కూడా

తాను స్వయంగా దగ్గరుండి కరోనాకు ఔషధాన్ని కనుగొన్నామంటూ గర్వంగా ప్రకటించిన యోగా గురు రామ్ దేవ్ బాబా, ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారు. పతంజలి విడుదల చేసిన ఔషధం కరోనాను వారం రోజుల్లో తగ్గిస్తుందని కూడా ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. రామ్ దేవ్ బాబా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లోని వార్తా చానెళ్లూ ప్రసారం చేశాయి. ఆపై గంటల వ్యవధిలోనే విమర్శలూ వెల్లువెత్తడంతో, ఉత్తరాఖండ్ సర్కారు, ఔషధానికి సంబంధించిన అన్ని వివరాలు, క్లినికల్ ట్రయల్స్ వివరాలు అందించాలని ఆదేశించింది.

రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు దగ్గును తగ్గించే ఓ మందును తయారు చేస్తున్నామని మాత్రమే పతంజలి సంస్థ తమను సంప్రదించిందని, ఈ డాక్యుమెంట్లలో కరోనా ప్రస్తావనే లేదని ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వారం రోజుల్లో ఈ మందు కరోనాను ఎలా తగ్గిస్తుంది? ఎవరిలో వైరస్ ను తగ్గించింది? తదితర వివరాలు అందించాలని ఆదేశించింది.

ఇక దేశవ్యాప్తంగా పతంజలి మందుపై విమర్శలు వెల్లువెత్తగా, పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదులు అందాయి కూడా. ఈ నేపథ్యంలో జైపూర్ లోని జ్యోతి నగర్ పోలీసులు మరో అడుగు ముందుకేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామ్ దేవ్ బాబాతో పాటు పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ, మరో ముగ్గురిపై కేసు రిజిస్టర్ చేశారు.

బల్బీర్ జక్కర్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420తో పాటు పలు సెక్షన్ల కింద కేసును రిజిస్టర్ చేశామని జైపూర్ డీసీపీ అవినాష్ పరాశర్ మీడియాకు వెల్లడించారు. రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ, బల్బీర్ సింగ్ తోమర్, అనురాగ్ తోమర్, వర్షిణిలపై కేసు పెట్టామని, వీరిపై డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ చట్టం, 1954 కింద కూడా కేసు ఉందని తెలిపారు.

వీరిలో బల్బీర్ సింగ్, అనురాగ్ లు జైపూర్ లోని నిమ్స్ యూనివర్శిటీలో చైర్మన్, డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ యూనివర్శిటీలోనే తాము క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని పతంజలి క్లయిమ్ చేసుకుందన్న సంగతి తెలిసిందే. కాగా, గడచిన మంగళవారం నాడు కరోనిల్, శ్వాసరి పేరిట వారం రోజుల్లోనే కరోనాను తగ్గిస్తుందంటూ ఓ ఔషధాల కిట్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఔషధంతో 100 శాతం పాజిటివ్ ఫలితాలను తాము కళ్లజూశామని కూడా రామ్ దేవ్ బాబా ప్రకటించుకున్నారు.