కరోనాపై ఐదంచల వ్యూహంతో వెళ్తాం: కేజ్రీవాల్

27-06-2020 Sat 15:42
  • బెడ్ల సంఖ్యను పెంచుతాం
  • ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తెస్తాం 
  • టెస్టింగ్, సర్వే, స్క్రీనింగ్ ను ముమ్మరం చేస్తాం
5 weapons to fight corona says Kejriwal

ఢిల్లీ ప్రభుత్వం రోజుకు 20 వేల కరోనా టెస్టులు చేస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. నగరంలో కరోనా పేషెంట్ల కోసం 13,500 హాస్పిటల్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి వీధిలో టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. జూన్ 8న అన్ లాక్-1 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని భావించామని... అయితే, ఊహించిన దానికంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఐదంచల వ్యూహంతో ముందుకెళ్తామని చెప్పారు.

ఆసుపత్రి బెడ్స్ సంఖ్యను పెంచడం ఇందులో ప్రధానమైనదని కేజ్రీవాల్ చెప్పారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను కోవిడ్ సెంటర్లుగా ప్రకటించడం వల్ల బెండ్ల సంఖ్యను మరో 3,500 పెంచామని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లోని 40 శాతం బెడ్లు కరోనా పేషెంట్లకు రిజర్వ్ అయి ఉన్నాయని చెప్పారు. ఆసుపత్రులతో పాటు హోటల్స్ వంటి వాటిని కూడా తీసుకున్నామని తెలిపారు.

కరోనా పేషెంట్లను గుర్తించిన వెంటనే ఐసొలేట్ చేస్తామని చెప్పారు. ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టెస్టింగ్, సర్వే, స్క్రీనింగ్ ను ముమ్మరం చేస్తామని చెప్పారు.