Yanam: భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఇద్దరు పిల్లలతో కలసి గోదావరిలో దూకిన జర్నలిస్టు

  • యానాంలో ప్రజాశక్తి దినపత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్
  • భార్యతో గొడవలతో మనస్తాపం
  • పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన కాసేపటికే తీవ్ర నిర్ణయం
Journalist suicide with his two children in Yanam

భార్యతో జరుగుతున్న గొడవలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ జర్నలిస్టు తన ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. యానాంకు చెందిన ముమ్మడి శ్రీనివాస్ (43) ప్రజాశక్తి దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. 2014లో కాకినాడ కొండయ్యపాలేనికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది.

ఐదేళ్ల క్రితం వీరికి హర్ష, హర్షిణి అనే కవలలు పుట్టారు. గత కొన్నేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు చెలరేగాయి. భార్య వేధింపులు భరించలేని శ్రీనివాస్ పలుమార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి వచ్చేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఇద్దరూ కలిసి నిన్న స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.  

వారి సమస్యను విన్న పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై ఇంటి నుంచి బయలుదేరి శ్రీనివాస్ ఎదుర్లంక బాలయోగి వారథి వద్దకు చేరుకున్నాడు. అనంతరం పిల్లలతో కలిసి బ్రిడ్జిపై నుంచి గౌతమీ గోదావరి నదిలో దూకాడు.

గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బోట్లతో రాత్రి ఏడు గంటల వరకు గాలించినా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. నేడు కూడా గాలింపు కొనసాగించనున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News