Patanjali: పతంజలి డ్రగ్ పై ట్రయల్స్ నిర్వహించిన ఆసుపత్రికి నోటీసులు

  • కరోనిల్ డ్రగ్ ను లాంచ్ చేసిన రాందేవ్ బాబా
  • ట్రయల్స్ నిర్వహించిన జైపూర్ లోని నిమ్స్ ఆసుపత్రి
  • నోటీసులు జారీ చేసిన రాజస్థాన్ ఆరోగ్యశాఖ
Notice To Jaipur Hospital For Conducting Trials Of Patanjali Drug

జైపూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) ఆసుపత్రికి రాజస్థాన్ ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. కరోనా వైరస్ డ్రగ్ అంటూ పతంజలి తయారు చేసిన కరోనిల్ మందుపై ట్రయల్స్ నిర్వహించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చింది.

ఈ సందర్భంగా జైపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ మాట్లాడుతూ, బుధవారం నాడు నిమ్స్ ఆసుపత్రికి నోటీసులు ఇచ్చామని... మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. కరోనిల్ డ్రగ్ పై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వానికి తెలపడం కానీ, అనుమతి తీసుకోవడం కానీ చేయలేదని అన్నారు. నిమ్స్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

కరోనిల్ డ్రగ్ ను లాంచ్ చేస్తున్నట్టు యోగా గురు రాందేవ్ బాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. హరిద్వార్ లో ఉన్న పతంజలి రీసర్చ్ సెంటర్ ఈ డ్రగ్ ను తయారు చేసిందని... జైపూర్ లో ఉన్న నిమ్స్ తో కలిసి ఉత్పత్తి చేసిందని ఆయన చెప్పారు. ఆయన ప్రకటన చేసిన వెంటనే వివాదం తలెత్తింది.

డ్రగ్ ట్రయల్స్ పై వివరాలు ఇవ్వాలని కేంద్ర ఆయుష్ శాఖ ఆదేశించింది. కరోనా మందుగా దీన్ని ప్రచారం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందిస్తూ, ఆయుష్ నుంచి అనుమతి వచ్చేంత వరకు ఈ డ్రగ్ ను రాష్ట్రంలో వినియోగించకూడదని ఆదేశించింది.

More Telugu News