Appolo Tyres: ఏపీలోని 'అపోలో టైర్స్' ప్లాంటు నుంచి తొలి టైర్ విడుదల.. వైసీపీపై నారా లోకేశ్ సెటైర్లు!

  • టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ ప్రారంభం
  • అభినందనలు తెలిపిన చంద్రబాబు, నారా లోకేశ్
  • కంపెనీని తీసుకురావడమంటే రంగులు వేసినంత ఈజీ కాదని లోకేశ్ సెటైర్
Bringing a company is not as easy as painting offices says Nara Lokesh

ప్రముఖ టైర్ల సంస్థ అపోలో టైర్స్ ఏపీలో ఏర్పాటు చేసిన ప్లాంట్ లో తయారైన తొలి టైరును విడుదల చేసింది. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ ఆ సంస్థకు అభినందనలు తెలియజేశారు. 'టీడీపీ హయాంలో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి.. తొలి దశలో రూ. 3,800 కోట్ల పెట్టుబడి పెట్టి.. ఈరోజు తొలి టైర్ ను విడుదల చేసిన అపోలో టైర్స్ వారిని అభినందిస్తున్నాను. కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని, రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి లోకేశ్ చురకలు అంటించారు. రాష్ట్రానికి ఒక కంపెనీని తీసుకురావడమంటే పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేసుకున్నంత ఈజీ కాదని ఎద్దేవా చేశారు. రికార్డ్ టైమ్ లో కంపెనీలు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నా, అది ఒక చంద్రబాబుకే సాధ్యమని అన్నారు.

మరోవైపు అపోలో టైర్స్ కు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. 'ఏపీ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలన్న తపనతో, రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తెచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మేము చేసిన కృషి ఇప్పుడు ఫలిస్తోంది. చిత్తూరు జిల్లా, చిన్నపండూరులో 2018లో ఏర్పాటు చేసిన అపోలో టైర్స్ ఈరోజు నుండి ఉత్పత్తి ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అని ట్వీట్ చేశారు.

More Telugu News