Mitte Fredrikson: మూడోసారి తన పెళ్లిని వాయిదా వేసుకున్న డెన్మార్క్ ప్రధాని!

  • శనివారం నాడు వివాహం చేసుకోవాలని ప్లాన్
  • అదే రోజు యూరోపియన్ యూనియన్ సమావేశం
  • జాతి ప్రయోజనాలే ముఖ్యమన్న మిట్టే ఫ్రెడ్రిక్ సన్
Denmark PM Marriage Cancelled Third Time

తన ప్రేయసిని పెళ్లాడాలన్న డెన్మార్క్ ప్రధాని మిట్టే ఫ్రెడ్రిక్ సన్ కోరిక ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. యూరోపియన్ యూనియన్ సమ్మిట్ జరుగనున్న కారణంగా మరోసారి తన వివాహం వాయిదా పడిందని, మనసిచ్చిన వాడిని మనువాడేందుకు ఇంకా ఎంతకాలం వేచిచూడాలోనని ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అయింది.

అంతకుముందు కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణాలతో వీరి వివాహం వాయిదా పడింది. "ఈ అద్భుతమైన వ్యక్తిని పెళ్లాడేందుకు నేను ఎంతో వేచి చూస్తున్నాను" అంటూ తన కాబోయే భర్తతో కలిసున్న చిత్రాన్ని ఆమె పోస్ట్ చేశారు. అతి త్వరలోనే తామిద్దరం ఒకటవుతామని ఆమె వ్యాఖ్యానించారు. వివాహం విషయంలో తను కూడా చాలా ఓపికతో ఉన్నారని కితాబిచ్చిన ఆమె, యూరోపియన్ కౌన్సిల్ సమావేశాలు డెన్మార్క్ కు అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.

 "ఎదురుచూపులు చూస్తూ ఉండటం అంత సులువు కాదు. మేము వివాహం చేసుకోవాలనుకున్న శనివారం నాడు బ్రసెల్స్ లో సమావేశానికి పిలుపునిచ్చారు. డెన్మార్క్ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడివున్న నేను, నా విధులను సక్రమంగా నిర్వర్తించాలని భావిస్తున్నాను. అందుకే పెళ్లికి మరో తేదీని నిర్ణయించుకుంటాం" అని మిట్టే తెలిపారు.

More Telugu News