ESO: అచ్చెన్నాయుడిని మూడు గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు!

  • ఈఎస్ఐ స్కామ్ లో భాగంగా గత వారం అరెస్ట్
  • కుంభకోణంలో ఎవరి వాటా ఎంత?
  • తేల్చేందుకు సిద్ధమైన ఏసీబీ
ACB Grills Accamnaidu over ESI Scam

ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) కుంభకోణంలో వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నిన్న విచారించిన ఏసీబీ ఉన్నతాధికారులు, పలు ప్రశ్నలను సంధించారు. ఈ కేసులో మొత్తం 19 మంది ప్రమేయముందని గుర్తించిన అధికారులు, ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో ఎవరి వాటా ఎంతన్న విషయాన్ని తేల్చేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా అచ్చెన్నాయుడిని మూడు రోజుల పాటు, మిగతా నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. నిన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని పొదిలి ప్రసాద్ బ్లాక్ కు చేరుకున్న అధికారులు, అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది, ఓ డాక్టర్ సమక్షంలో ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించి, సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అచ్చెన్న, మరికొన్నింటిని దాటవేసినట్టు సమాచారం.

ఆచ్చెన్నాయుడిని మూడు గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ డీఎస్పీలు ప్రసాద్, సూర్య నారాయణరెడ్డి, చిరంజీవి నేతృత్వంలోని బృందం, పలు కీలక విషయాలపై సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించింది. టెలీ హెల్త్ సర్వీసెస్ ఇచ్చిన సిఫార్సులపైనే ప్రధానంగా ప్రశ్నలు అడిగారని సమాచారం. ఈ విచారణ ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసినట్టు తెలిసింది. కాగా, నేడు కూడా అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

More Telugu News