Britain: అంతలోనే తుక్కుగా మారిన రెండు కోట్ల రూపాయల కొత్త కారు!

New Lamborghini sports car crashes in West Yorkshire twenty minutes
  • రూ.2 కోట్లు పెట్టి కొన్న కారు 20 నిమిషాలకే తుక్కు
  • వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టిన మరో కారు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
రెండు కోట్ల రూపాయలు పెట్టి ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు 20 నిమిషాలకే తుక్కుతుక్కుగా మారితే ఆ బాధ వర్ణించతరం కాదు. నుజ్జునుజ్జు అయిన కారును చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం. బ్రిటన్‌లోని వేక్‌ఫీల్డ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. రెండు కోట్ల రూపాయల విలువైన గ్రే కలర్ లంబోర్గిని హరికేన్ స్పైడర్ మోడల్ కారును ఓ వ్యక్తి ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాడు. కారు తాళాలు అందుకున్న వెంటనే ఆనందంలో తేలియాడిపోయాడు. కారు స్టార్ట్‌ చేసి కొంతదూరం ప్రయాణించిన తర్వాత కారులో సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో ఏమైందో తెలుసుకునేందుకు కిందికి దిగాడు.

అప్పుడే జరగరానిది జరిగింది. అతడు కిందికి దిగిన మరుక్షణం వెనక నుంచి వచ్చిన మరో కారు ఈ లంబోర్గినిని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనకభాగం పూర్తిగా దెబ్బతింది. కారు కొన్న 20 నిమిషాల్లోనే కళ్లెదుటగా తుక్కుగా మారడంతో అతను అప్పటి వరకు అనుభవించిన ఆనందం మొత్తం ఆవిరైంది. ప్రమాదానికి గురైన కారు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోలీసులు ‘ఏడ్చిన కారు ఏదైనా ఉందంటే అది ఇదే’ అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. కారు యజమాని దురదృష్టానికి జాలిపడుతూ ఊరడించే కామెంట్లు పెడుతున్నారు.
Britain
Lamborghini
sports car
Road Accident

More Telugu News