Fair and Lovely: 'ఫెయిర్ అండ్ లవ్లీ' నుంచి 'ఫెయిర్'ను తొలగించాలని కీలక నిర్ణయం!

Hindustan Unilever decides to remove Fair from Fair and Lovely
  • జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత మారుతున్న పరిణామాలు
  • ఫెయిర్ ను తొలగించాలని నిర్ణయించిన హిందుస్థాన్ యూనిలీవర్
  • కొన్ని నెలల్లోనే ప్యాక్ లపై కొత్త పేరు వస్తుందని ప్రకటన
ప్రముఖ హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తుల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న వాటిలో ఒకటైన ఫేస్ క్రీమ్ 'ఫెయిర్ అండ్ లవ్లీ'లో 'ఫెయిర్' అనే పదాన్ని తొలగించాలని నిర్ణయించింది.

తెల్లగా ఉండటం గొప్ప అన్నట్టుగా, నల్లగా ఉండటాన్ని అంద విహీనం అన్నట్టుగా చూపిస్తూ సౌందర్య ఉత్పత్తుల ఉత్పాదకులు మార్కెటింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం చోటు చేసుకున్న తర్వాత... వర్ణ వివక్షపై ప్రపంచంలోని పలు దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫెయిర్ అనే పదాన్ని తొలగించాలని హిందుస్థాన్ యూనిలీవర్ నిర్ణయించింది.

ఈ సందర్భంగా హిందుస్థాన్ యూనిలీవర్ ఎండీ సంజీవ్ మెహతా మాట్లాడుతూ... 2019లో రెండు రంగులతో వుండే మరో ముఖాన్ని, కలర్ షేడింగ్ ను ప్యాకింగ్ పై తొలగించామని చెప్పారు. ఉత్పత్తి ప్రచారాన్ని కూడా మంచి రంగు కోసం అని కాకుండా మెరుపు కోసం అనేలా మార్చామని తెలిపారు. ఈ మార్పుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తాము మరో కీలక ప్రకటన చేస్తున్నామని... ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ అనే పదాన్ని తొలగిస్తున్నామని చెప్పారు. కొత్త పేరు ప్రస్తుతానికి రెగ్యులేటరీ అప్రూవల్ కోసం వేచి చూస్తోందని... కొన్ని నెలల్లోనే ప్యాక్ లపై కొత్త పేరు వస్తుందని తెలిపారు.
Fair and Lovely
Fair
Hindustan Unilever

More Telugu News