Jogi Ramesh: వేల కోట్లు దోచుకున్న మిమ్మల్ని ఊరికే వదిలిపెడతామా?: జోగి రమేశ్

Jogi Ramesh slams TDP leaders in the sidelines of Atchannaidu issue
  • టీడీపీ నేతలపై తీవ్రంగా మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే
  • అవినీతికి పాల్పడిన వాళ్లు తప్పించుకోలేరని వెల్లడి
  • ఇది జగన్ ప్రభుత్వమంటూ ఉద్ఘాటన
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ టీడీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్లు దోచుకున్న మిమ్మల్ని వదిలిపెడతామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జగన్ ప్రభుత్వం అని, అవినీతికి పాల్పడిన వాళ్లు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

దేవినేని ఉమ, ఆలపాటి రాజేంద్ర వంటి వారు ఇవాళ విధ్వంసం అని, కూలగొట్టారని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏదో సంతాపం వెలిబుచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వీళ్లు టీవీలో కనబడడానికి తప్ప, ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకోవడానికి తప్ప దేనికీ పనికిరారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఉమ మీడియాలో సొల్లు చెప్పడానికి తప్ప అణాకానీకి కూడా పనికిరాడని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ సుపరిపాలన వల్ల కనీసం నిరసన తెలిపేందుకు కూడా విపక్షాలకు అవకాశం లేకుండా పోయిందని అన్నారు.

అంతకుముందు జోగి రమేశ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మండిపడ్డారు. రాజకీయ హత్యలు చేయడంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. రూ.151 కోట్ల కుంభకోణానికి పాల్పడిన అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయకూడదా? పల్లకీలో ఎక్కించి ఊరేగించాలా? అంటూ ప్రశ్నించారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారితే చంద్రబాబు, లోకేశ్ ఊచలు లెక్కబెట్టే పరిస్థితి రావొచ్చని అన్నారు.

ఈ స్కాంలో విచారణ జరిగితేనే దొంగలు బయటపడతారని, ఇవాళ అచ్చెన్నాయుడు బయటపడ్డాడని, రేపు చంద్రబాబు, లోకేశ్ బయటపడతారని అన్నారు. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి పట్ల సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా ఎంతో ఆందోళన చెందుతున్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని వివరించారు. కానీ, టీడీపీ నేతలు అచ్చెన్న హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించడం వారి నీచత్వాన్ని చాటుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jogi Ramesh
Atchannaidu
Telugudesam
Chandrababu
Devineni Uma
Alapati Rajendra
Jagan
YSRCP
ESI Scam
Andhra Pradesh

More Telugu News