Centre: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దు.... 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు!

  • పరీక్షలు రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్
  • తాజా నోటిఫికేషన్ జారీ చేయాలన్న సుప్రీం ధర్మాసనం
  • తదుపరి విచారణ రేపటికి వాయిదా
Centre cancels CBSE exams

సీబీఎస్ఈ పరీక్షల రద్దు కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు వైరస్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ సందర్భంగా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరాలు తెలిపారు. మిగిలిన 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించిందని వెల్లడించారు. జూలై 1 నుంచి 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినా, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, 12 వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నామని చెప్పారు. పరీక్షలకు హజరవ్వాలో, వద్దో నిర్ణయించుకునే అవకాశం విద్యార్థులకే ఇవ్వనున్నామని తెలిపారు. లేకపోతే, ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటును కూడా వారికి ఇస్తున్నామని వివరించారు. ఈ ఫలితాలను జూలై 15న వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

More Telugu News