Raghurama Krishnamraju: రాష్ట్రస్థాయి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు?: షోకాజ్ నోటీసులపై విజయసాయికి రఘురామకృష్ణంరాజు సూటి ప్రశ్న

  • రఘురామకృష్ణంరాజుకు వైసీపీ నోటీసులు
  • పార్టీకి క్రమశిక్షణ సంఘం ఎక్కడుందున్న ఎంపీ
  • మీ వల్లే హాని జరుగుతోందంటూ విజయసాయిపై వ్యాఖ్యలు
Raghurama Krishnamraju responds on notices

గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర చర్చనీయాంశంగా మారారు. తన పార్లమెంటు స్థానం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయన సాగిస్తున్న పోరాటం పార్టీ అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. దాంతో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నుంచి వెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై రఘురామకృష్ణంరాజు ఊహించని విధంగా స్పందించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి అనేక సందేహాలు, ప్రశ్నలతో లేఖ రాశారు.

"మీరు నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోటీసులు పంపారు.  ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిన ప్రకారం పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై నోటీసులు పంపారు. అదేమైనా మరో పార్టీనా... ఎన్నికల సంఘం వద్ద కొత్తగా రిజిస్టర్ అయిందా?... మరీ ముఖ్యంగా ఓ విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. విజయసాయిరెడ్డి గారూ, మిమ్మల్ని మీరు పార్టీ జాతీయ కార్యదర్శిగా పేర్కొంటున్నారు. మన పార్టీ రిజిస్టర్ అయింది ఓ ప్రాంతీయ పార్టీగా. ఓ రాష్ట్ర పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంటాడా?

పార్టీలో క్రమశిక్షణ సంఘం అంటున్నారు. దీనికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా? ఉంటే, అందులోని సభ్యులెవరు? చైర్మన్ ఎవరు? వారెవరైనా ఉంటే, నాకు షోకాజ్ నోటీసులు పంపడంలో ఎలాంటి విధానం పాటించారు? ఒకవేళ అన్నీ సజావుగా జరిగాయని మీరు చెబుతున్నట్టయితే, నాకు నోటీసులు పంపడానికి క్రమశిక్షణ సంఘం సమావేశమైనప్పటి మినిట్స్ పంపండి.

పబ్లిక్ డొమైన్ లో ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాకు తెలిసినంతవరకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి న్యాయపరమైన గుర్తింపు ఉన్న, ఎలాంటి అధికారిక క్రమశిక్షణ సంఘం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుమీద లెటర్ హెడ్స్ ఉపయోగించడానికి మీరు మన ప్రియతమ నాయకుడు జగన్ అనుమతి తీసుకున్నారని భావిస్తాను. కానీ లెటర్ హెడ్స్ మీద వైఎస్సార్ అని ఉపయోగించడం కుదరదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని మాత్రమే ఉపయోగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

మన ప్రియతమ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ వీరాభిమానిగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నియమాలు, నిబంధనలు, విధివిధానాలు, సిద్ధాంతాలను ఎంతగానో గౌరవిస్తాను. అయితే, పార్టీ తరఫున ఓ క్రమశిక్షణ సంఘం ఉందని, దానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందని భావించినప్పుడే మీరు పంపిన షోకాజ్ నోటీసులపై నేను స్పందిస్తాను. ఆ హక్కు నాకుంది. సరైన అధికారం లేకుండా మీరు నాకు నోటీసులు పంపారంటూ న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోగలను. అన్నిటికీ మించి, మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే... పార్టీ ఉనికికి హాని కలిగించకండి. అందరికంటే మీ వల్లే పార్టీకి ఎక్కువగా నష్టం జరుగుతోంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News