Nara Lokesh: వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారు: నారా లోకేశ్

  • సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ
  • ఇసుక మాఫియా దెబ్బకు నిర్మాణ రంగం కుదేలైందని విమర్శలు
  • సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
Nara Lokesh writes a letter to CM Jagan

వైసీపీ ఇసుక మాఫియా దెబ్బకు రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. ఇసుక ఆన్ లైన్ బుకింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 5 నిమిషాల్లోనే ముగిసిపోతోందని, ఆ తర్వాత నో స్టాక్ అని వస్తోందని తెలిపారు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదని సొంత పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలే అంటున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఇటీవలే ఓ మంత్రికి ఇసుక బదులు మట్టి పంపారని, ఇదంతా స్టాక్ యార్డు ముసుగులో జరుగుతున్న దోపిడీ అని ఆరోపించారు. ఇందులో అధికారులు, వైసీపీ నేతలే సూత్రధారులని నారా లోకేశ్ తన లేఖలో వివరించారు.

టీడీపీ హయాంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీ అమలు చేశామని, కానీ ఇప్పుడు ఇసుక సరఫరా మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమాలను సహించబోనని ప్రకటించిన సీఎం జగన్ ఇవాళ ఎందుకు మౌనంగా ఉంటున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, అనేక రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కార్మికులను ఆదుకున్నాయని తెలిపారు. కానీ మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వలేదని, ఆ సొమ్మును కూడా సిగ్గులేకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో వినియోగించారని మండిపడ్డారు.

More Telugu News