Jitu Patwari: 'ఒక్క అబ్బాయి కోసం ఐదుగురు అమ్మాయిలు' అంటూ తీవ్ర వివాదంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత!

  • కేంద్ర నిర్ణయాలను అమ్మాయిలతో పోల్చిన జితూ పట్వారీ
  • అభివృద్ధి అనే కొడుకు మాత్రం పుట్టడం లేదని ట్వీట్
  • విమర్శలు రావడంతో క్షమాపణలు
Jitu Patwari Contravercial comments

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ విద్యా మంత్రి జితూ పట్వారీ, తన ట్వీట్ తో తీవ్ర వివాదాన్ని కొనితెచ్చుకున్నారు. కేంద్ర పథకాలను అమ్మాయిలతో పోల్చడమే ఆయన చేసిన తప్పయింది. డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి వాటిని అమ్మాయిలతో పోలుస్తూ ఆయన ట్వీట్ చేశారు. వికాస్ (అభివృద్ధి) అనే కొడుకు కోసం ఇప్పటికే ఐదుగురు కూతుళ్లను కేంద్రం అందించిందన్న అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు.

"ప్రజలంతా ఓ కుమారుడు కావాలని అనుకుంటున్నారు. కానీ, కుమార్తెలు మాత్రమే పుడుతున్నారు. అభివృద్ధి అనే కొడుకు మాత్రం పుట్టడం లేదు" అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రవూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జితూ పట్వారీ చేసిన ఈ ట్వీట్ పై పలు వర్గాలు మండిపడ్డాయి. లింగ సమానత్వాన్ని ఆయన మరిచారని, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒకేలా చూడకుండా, ఇలా వివక్షా పూరిత వ్యాఖ్యలేంటన్న విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో ఆయన క్షమాపణలు చెబుతూ, మరో పోస్ట్ ను పెట్టారు. "ఎవరి సెంటిమెంట్ అయినా, నా వ్యాఖ్యలతో దెబ్బతినుంటే, చింతిస్తున్నాను. నా వరకూ నాకు కుమార్తెలంటే దేవతల వంటి వారు. నరేంద్ర మోదీ దేశ వెన్నెముకను విరిచేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థికమాంద్యం... ఇలా ఎన్నో కష్టాలు చుట్టుముట్టాయి. ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారన్న ఆలోచనతో ఈ ట్వీట్ పెట్టాను. ఎవరైనా మనస్తాపం చెందివుంటే క్షంతవ్యుడిని" అని ఆయన పేర్కొన్నారు. 

More Telugu News