Galwan Valley: ఏ మాత్రమూ వెనక్కు తగ్గని చైనా... గాల్వాన్ కొత్త శాటిలైట్ చిత్రాల విడుదల!

  • గాల్వాన్ లోయలో పలు నిర్మాణాలు
  • పెట్రోల్ పాయింట్ 14 దగ్గరే నిర్మాణాలు
  • భారీ ఎత్తున మకాం వేసిన సైన్యం
New Satilite Images Shows Structures in Galwan Vally

భారత భూభాగంలోని గాల్వాన్ లోయను ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న చైనా ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఓ వైపు శాంతి మాటలు చెబుతూనే మరోవైపు లోయలో భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. తాజాగా, జూన్ 22న విడుదలైన శాటిలైట్ చిత్రాలు ఈ విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్యా సైనిక చర్చల అనంతరం తమ బలగాలను వెనక్కు తీసుకుని వెళ్లేందుకు చైనా అంగీకరించినట్టు వార్తలు వచ్చిన సమయంలోనే, హై రెజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు కూడా విడుదల కావడం గమనార్హం.

ఇదే లోయలో ఈ నెల 15న చైనా, భారత్ సైనికుల మధ్య తీవ్ర యుద్ధం జరుగగా, ఇరు పక్షాలకు చెందిన 60 మందికి పైగా మరణించారన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ వ్యాలీలో చైనా ఆర్మీకి చెందిన ఒకే టెంట్ ఉండగా, ఇప్పుడు అదే ప్రాంతంలో ఎన్నో నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఈ తాజా చిత్రం మొత్తం వివాదానికి కారణమైన పెట్రోల్ పాయింట్ 14 దగ్గరిదే కావడం గమనార్హం. ఇక్కడ చైనా సైన్యం నిర్మాణాలను చేపట్టి, వాటిని పూర్తి చేసిందని, భారీ వాహనాలు, పెద్దమొత్తంలో సైన్యం ఇక్కడ మకాం వేసిందని ఈ చిత్రాలను చూస్తే తెలుస్తోంది.

గాల్వాన్ లోయపై కల్వర్టుల నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవ నియంత్రణా రేఖ వెంబడి చైనా నిర్మాణాలు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. జూన్ 16న తీసిన చిత్రాల్లో ఆ ప్రాంతంలో ఓ బుల్డోజర్ కనిపిస్తుండగా, 22 నాటికి అదే ప్రాంతంలో కల్వర్ట్ నిర్మాణం పూర్తయింది. ఇక ఇదే విషయమై విదేశాంగ శాఖను మీడియా సంప్రదించగా, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే స్పందిస్తామని వెల్లడించింది.

More Telugu News