Lockdown: కరోనాపై వాట్ నెక్ట్స్... కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్న మోదీ!

  • ప్రారంభమైన మోదీ క్యాబినెట్ మీటింగ్
  • కరోనా, చైనాతో వివాదాలపై చర్చించనున్న మంత్రివర్గం
  • కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్!
Modi crucial Cabinet Meeting Start

ఇండియాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న వేళ, తదుపరి వైరస్ ను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరయ్యారు. కరోనాతో పాటు చైనాతో సరిహద్దు వివాదాలు, లాక్ డౌన్ కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం, మూడో విడత ఉద్దీపన తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయని సమాచారం.

ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను మంత్రివర్గం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. చైనాకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు కోరుకుంటున్న వేళ, కొన్ని రకాల చైనా వస్తువుల దిగుమతులపై సుంకాలను పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు మరోసారి లాక్ డౌన్ ను ప్రకటించే అంశంపైనా మోదీ, తన సహచరుల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు.

పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, నగరాలు, పట్టణాల వారీగా కేసుల సంఖ్యను బట్టి, లాక్ డౌన్ ను అమలు చేస్తున్న వేళ, ఆర్థిక వృద్ధి కొంత తగ్గినా, ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని మోదీ నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ 1.0లో అమలు చేసిన నిబంధనలను అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకోవచ్చని, మిగతా ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతమున్న స్థితినే కొనసాగించాలన్న నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.

More Telugu News