APSRTC: తెలంగాణ, ఏపీల మధ్య బస్సులు ఇప్పట్లో లేనట్టే!

  • నేడు జరగాల్సిన ఉన్నతాధికారుల సమావేశం వాయిదా
  • అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి
  • కరోనా కేసులు పెరగవచ్చన్న ఆలోచనతోనే వాయిదా
Todyas RTC Officials Meeting Cancelled

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. నేడు జరగాల్సిన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల నిర్వహణపై చర్చించాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించగా, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో బస్సులు నడిపిస్తే కేసులు మరింతగా పెరగవచ్చన్న ఆలోచనతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు.

కాగా, అనివార్య కారణాల వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్యా బస్సులను నడిపించే విషయమై గతంలోనే ఓ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలు తమతమ రాష్ట్రాల పరిధిలో మాత్రమే బస్సులు నడుపుతున్నాయి. తాజా సమావేశం వాయిదా పడటంతో బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయని ఎదురుచూసిన తెలుగు ప్రజలకు నిరాశే మిగిలింది.

More Telugu News