Bridge: భారత్-చైనా సరిహద్దుల్లో కుప్పకూలిన కీలక వంతెన... వీడియో ఇదిగో!

  • 15 గ్రామాల రాకపోకలకు ఉపయోగపడుతున్న వంతెన
  • భారత సైన్యం, ఐటీబీపీ బలగాలు దీని ద్వారానే రాకపోకలు
  • పునరుద్ధరణకు మరో రెండు వారాల సమయం
Bridge collapsed near Indo China border

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఉత్తరాఖండ్ పితోర్గడ్ జిల్లాలో ఓ వంతెన కుప్పకూలింది. చైనా సరిహద్దుకు సమీపంలోని జోహార్ లోయలో ఉన్న ఈ వంతెనపై ఓ క్రేన్ ను మోసుకుని వెళుతున్న లారీ ప్రయాణిస్తుండగా ఇది కూలిపోయింది. ఆ బ్రిడ్జి కెపాసిటీ 18 టన్నులు కాగా, క్రేన్ తో కలిపి లారీ బరువు 26 టన్నులు. ఓవర్ లోడ్ కారణంగానే బ్రిడ్జి కూలిపోయినట్టు భావిస్తున్నారు. ఈ బ్రిడ్జి ద్వారా 15 గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు వీలవుతుంది. ఇప్పుడిది కూలిపోవడంతో తీవ్ర ఆటంకం ఏర్పడింది.

వ్యూహాత్మకంగా కూడా ఈ వంతెనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ బలగాలు ఈ వంతెన ద్వారానే సరిహద్దు ప్రాంతాలకు వెళుతుంటాయి. 40 అడుగుల పొడవైన ఈ వంతెనను 2009లో నిర్మించారు. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ వంతెన కూలిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూలిన వంతెన పునరుద్ధరించేందుకు మరో రెండు వారాల సమయం పడుతుందని భావిస్తున్నారు.


More Telugu News