Varla Ramaiah: వారేమైనా అసాంఘిక శక్తులా? కలిస్తే తప్పేమిటి?: పార్క్ హయత్ భేటీపై వర్ల రామయ్య

  • నిమ్మగడ్డ, సుజనా, కామినేని భేటీ అయితే తప్పేముంది?
  • మిడిమిడి జ్ఞానంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు
  • పోలీసు విభాగానికి సాక్షి అనుబంధ సంస్థా?
They are not culprit like Jagan says Varla Ramaiah

నిమ్మగడ్డ రమేశ్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల భేటీ ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ అంశంపై మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ, వారు ముగ్గురూ భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. వారేమైనా అసాంఘిక శక్తులా? అని నిలదీశారు.

ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నేత విజయసాయిరెడ్డిలా వారు తప్పులు చేయలేదని... ఏ కేసులోనూ వారు ముద్దాయిలు కాదని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ... అయితే, ఆయనను తిరిగి నియమించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలను లెక్కిస్తోందని అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకే నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు సుజనా, కామినేని భేటీ అయ్యుండచ్చని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వైసీపీ ప్రభుత్వం బేఖాతరు చేసిందని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ముఖం వెలిగిపోతోందని... హావభావాలను చూపిస్తూ నటిస్తున్నారని వర్ల విమర్శించారు. దొంగ దొరికాడంటూ అంబటి వ్యాఖ్యానించారని... ఎవరు దొంగ అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ అపాయింట్ మెంట్ తీసుకునే సుజనా, కామినేని వెళ్లినట్టున్నారని... ఏపీ ప్రభుత్వ తీరును కేంద్రం దృష్టికి తీసుకెళ్లమని చెప్పేందుకు వెళ్లినట్టున్నారని అన్నారు.

మిడిమిడి జ్ఞానంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు తీసుకెళ్లారని అంటున్నారని... అలాంటప్పుడు అది సాక్షి చానల్ కి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. పోలీసు విభాగానికి సాక్షి అనుబంధ సంస్థా? అని అడిగారు. ఒకవేళ ఫుటేజీని ప్రభుత్వ యంత్రాంగమే ఇస్తే... అన్ని చానళ్లకు ఇవ్వాలని, కానీ సాక్షికి మాత్రమే ఎలా ఇస్తారని అన్నారు. సాక్షి పుట్టుకే అవినీతిమయమని... దీని సంగతి  కోర్టు విచారణలో ఉందని, త్వరలోనే అన్నీ తేలుతాయని చెప్పారు.

More Telugu News