Krishna District: ఇంటర్‌లో తప్పానన్న బాధతో బాలిక ఆత్మహత్య!

  • కృష్ణా జిల్లా గుడివాడలో ఘటన
  • ఇంటర్ ఫస్టియర్‌లో తప్పానని మనస్తాపం
  • ఎలుకల మందు తిని ఆత్మహత్య
Inter girl suicide in krishna dist

ఇంటర్ ఫస్టియర్ తప్పానన్న మనస్తాపంతో ఓ బాలిక సాయంత్రం నాలుగు గంటలకు ఆత్మహత్య చేసుకుంది. ఐదు గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం అందరూ పాస్ అయినట్టు పేర్కొంది. అంటే బాధిత బాలిక ఒక్క గంటపాటు క్షణికావేశానికి గురికాకుండా ఉంటే ప్రాణాలు మిగిలేవి.

కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిందీ ఘటన. స్థానిక ధనియాలపేటకు చెందిన బాలిక (17) ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో తప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక శనివారం నాలుగు గంటల సమయంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను పీహెచ్‌సీకి, అక్కిడి నుంచి బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది.

కాగా, బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గంట తర్వాత ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం అందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో బాలిక ఒక గంటపాటు ఓపిక పట్టి ఉంటే ఆమె ప్రాణాలు దక్కి ఉండేవని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News