India: సింహంలా దుమికిన కల్నల్ సంతోష్ బాబు... గతవారం ఘర్షణపై తాజాగా వెల్లడైన వివరాలు!

Full Details of China Attack on Indian Army
  • పీపీ-14 వద్ద గుడారాలు వేసిన చైనా
  • చర్చల తరువాత తొలగించేందుకు అంగీకారం
  • తొలగింపు పర్యవేక్షణ బాధ్యతలు సంతోష్ టీమ్ కు అప్పగింత
  • చైనా వెనక్కు తగ్గకపోయేసరికి మొదలైన వివాదం
  • వివరాలు వెల్లడించిన సైనిక వర్గాలు

భరతమాత ముద్దుబిడ్డ, తెలుగు తల్లి ఒడిలో పెరిగిన కల్నల్ సంతోష్ బాబు... తనకు గాయాలైనా, చుట్టూ అధిక సంఖ్యలో శత్రువులు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నా వెన్ను చూపక, వారితో పోరాడుతూ ప్రాణాలు వదిలిన యోధుడు. అతని పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమంటూ, ఆసలు ఈ నెల 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి. సంతోష్ నాయకత్వంలోని భారత బలగాలు, వీరోచిత పోరాటం జరిపాయని వారు కొనియాడారు.

గత నెలలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కల్నల్ సంతోష్ బాబు కమాండింగ్ అధికారిగా ఉన్న 16 బీహార్ రెజిమెంట్ కు గాల్వాన్ ప్రాంతంలో డ్యూటీ పడగా, తన టీమ్ తో ఆయన అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తతలను చల్లార్చేందుకు 6వ తేదీన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైన్యాధికారుల మధ్య చర్చలు జరుగగా, ఇరు దేశాలూ తమతమ బలగాలను వెనక్కు తరలించాయి. ఆ సమయంలో గాల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ - 14 నుంచి చైనా సైన్యం వెనక్కు వెళ్లడాన్ని సమీక్షించే బాధ్యత సంతోష్ బృందానికి అప్పగించారు.

చర్చల తరువాత ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన చైనా ఆర్మీ, ఆ వెంటనే మళ్లీ వచ్చింది. 14న ఓ బార్డర్ మానిటరింగ్ కేంద్రాన్ని, కొన్ని గుడారాలను ఏర్పాటు చేయగా, వీటిని తొలగించాలని కోరుతూ, తన గస్తీ బృందాన్ని సంతోష్ బాబు పంపారు. వారు వెళ్లి మాట్లాడగా, చైనా సైనికులు ఏ మాత్రమూ అంగీకరించలేదు. పైగా భారత సైన్యం వచ్చి వెళ్లిన తరువాత, చైనా మరింత సైన్యాన్ని ఆ ప్రాంతానికి రప్పించింది. దీంతో వారిని ఖాళీ చేయించేందుకు సంతోష్ స్వయంగా రంగంలోకి దిగారు. 15న ఆ చైనా శిబిరాల వద్దకు తన టీమ్ తో వెళ్లిన ఆయనకు కొత్తవారు ఉన్నారని అర్థమైంది.


వాస్తవానికి ఆ ప్రాంతంలో విధులు నిర్వహించే చైనా సైనికులు కల్నల్ కు తెలుసు. కొత్తవారు కనిపించడంతో, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, తమ ప్రాంతంలో అబ్జర్వేషన్ పోస్ట్ ఏర్పాటు చేయడం అక్రమమని చైనా కమాండర్ కు సంతోష్ స్పష్టం చేస్తున్న వేళ, ఆయన టీమ్ లోని ఒకరు సంతోష్ పై చెయ్యి చేసుకుని బలంగా తోసేశాడు. తమ సీఓను వెనక్కు నెట్టడంతో, భారత జవాన్లలో ఆగ్రహం పెరిగి, చైనా సైనికులతో బాహాబాహీకి దిగారు. దాదాపు అరగంట పాటు పోరు సాగగా, భారత బలగాలదే పైచేయి అయింది. ఈ పోరులో పలువురు గాయపడ్డారు కూడా.

ఆ తరువాత చైనా సైనికులు వెళ్లిపోగా, వారి గుడారాలను నేలకూల్చిన సంతోష్ టీమ్, వాటిని కాల్చి బూడిద చేసింది. అప్పటికే సంతోష్ బాబుకు గాయాలు అయ్యాయి. అయినా చికిత్స నిమిత్తం వెళ్లేందుకు నిరాకరించిన ఆయన, తన బృందంతో అక్కడే ఉండిపోయారు. ఇతర గాయపడిన వారిని వెనక్కు పంపారు. ఆపై కాసేపటికే దాదాపు 350 మంది చైనా సైనికులు ఆ ప్రాంతానికి వచ్చారు. వారి వద్ద మేకులు కలిగిన ఇనుప కడ్డీలు ఉండగా, భారత సైనికులు మాత్రం తమ తుపాకుల బాయ్ నెట్లనే ఆయుధాలుగా చేసుకుని వారిని ఎదుర్కొన్నారు. చైనా సైనికులు భారీ ఎత్తున ఉన్నా, సుమారు 100 మందిని మాత్రమే కలిగున్న సంతోష్, తన జవాన్లను ముందుండి నడిపించగా, దాదాపు మూడు గంటల పాటు భీకర పోరాటానికి గాల్వాన్ లోయ సాక్షిగా నిలిచింది.
అప్పటికే చీకటి పడగా, అంతవరకూ ఓ పర్వతంపై మాటు వేసివున్న చైనా బలగాలు, వేగంగా అక్కడికి చేరుకుని, పెద్ద పెద్ద రాళ్లతో భారత సైన్యంపై దాడి చేసింది. సంతోష్ తలకు ఓ పెద్ద రాయి తగలడంతో, ఆయన లోయలోకి జారిపోయారు. దీంతో భారత సైనికులు మరింత ఆగ్రహంతో చైనా సైనికులపై విరుచుకుపడి, వారిని తరిమేయడం ప్రారంభించారు. ఈ ఘర్షణలో ఇరు దేశాలకూ చెందిన పలువురు మరణించగా, పోరు ఆగిన తరవాత, రెండు దేశాలకు చెందిన పలువురి మృతదేహాలు నదిలో కనిపించాయి. సంతోష్ తో పాటు, ఇతర అమరవీరుల మృతదేహాలను భారత సైన్యమే అక్కడి నుంచి తరలించింది.

మరుసటి రోజు ఉదయానికి ఉద్రిక్తతలు కాస్తంత తగ్గే వేళకు కూడా చైనా జవాన్ల మృతదేహాలు గాల్వాన్ లోయలోనే పడిపోయి ఉన్నాయి. వాటిని కూడా భారత జవాన్లే బయటకు తెచ్చి, చైనా అధికారులకు అప్పగించారు. తన వద్ద జవాన్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద చైనా దురాక్రమణను సమర్థవంతంగా అడ్డుకున్న కల్నల్ సంతోష్ బాబుకు ఇప్పుడు జాతి యావత్తూ నీరాజనాలు పలుకుతోంది. మన జవాన్ల త్యాగాలను వృథా కానివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News