Rahul Gandhi: సరెండర్ మోదీ... సరిహద్దు వివాదంలో ప్రధాని తీరుపై రాహుల్ అసంతృప్తి

  • చైనాతో సరిహద్దు వివాదంలో మోదీ వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం
  • చైనా దూకుడుకు మోదీ తలొగ్గారన్న రాహుల్
  • జపాన్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనాన్ని పేర్కొన్న కాంగ్రెస్ అగ్రనేత
Rahul Gandhi terms PM as Surrender Modi

చైనా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశంలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దురాక్రమణలు జరగకపోతే ఇంతమంది సైనికులు ఎందుకు మరణించారు? మీ వ్యాఖ్యలు చైనాకు మద్దతిచ్చేలా ఉన్నాయి అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఎలుగెత్తారు. తాజాగా రాహుల్ గాంధీ తన విమర్శల్లో మరింత పదును పెంచారు. ప్రధాని మోదీ చైనాకు లొంగిపోయారన్న అర్థంలో, "నరేందర్ మోదీ కాదు, వాస్తవానికి ఆయన సరెండర్ మోదీ" అంటూ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా జపాన్ టైమ్స్ పత్రికలో భారత ప్రభుత్వ వైఫల్యం అంటూ వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. ఎన్నో ఏళ్లుగా భారత్ నాయకత్వం చైనాకు అణిగిమణిగి ఉంటోందని, దాని ఫలితమే భారత్ భూభాగంలో చైనా మరోసారి ఆక్రమణకు పాల్పడిందని జపాన్ పత్రిక పేర్కొంది. ఈ పరిణామంతోనైనా మోదీ ఆలోచనా దృక్పథం మారేనా? అంటూ ఆ పత్రికలో నిశిత వ్యాఖ్యలు చేశారు. అటు, ట్విట్టర్ లోనూ రాహుల్ తీవ్రస్థాయిలో స్పందించారు. చైనా దూకుడుకు తలొగ్గిన ప్రధాని మోదీ భారత భూభాగాన్ని వారికి అప్పగించేశారని ఆరోపించారు.

More Telugu News