Ramchandrareddy: కాంగ్రెస్ సీనియర్ నేత రాంచంద్రారెడ్డి హత్యకేసు: వెలుగులోకి పలు విషయాలు

  • అప్పుల్లో కూరుకుపోయిన ప్రతాప్‌రెడ్డి
  • రూ. కోట్లలో ఇస్తానని ఇవ్వకుండా తిప్పించుకుంటున్న రాంచంద్రారెడ్డి
  • మధ్యాహ్నం చర్చలు.. సాయంత్రం హత్య
Congress leader Ramchandra Reddy murder case investigation going on

జడ్చర్ల సీనియర్ కాంగ్రెస్ నేత రాంచంద్రారెడ్డి హత్యకేసులో మరిన్ని విషయాలు బయటకొచ్చాయి. ఆయనపై కత్తితో విచక్షణ రహితంగా దాడి జరిగినట్టు తెలుస్తోంది. రాంచంద్రారెడ్డి మృతదేహంపై ఏకంగా 28 కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాంచంద్రారెడ్డి, ప్రతాప్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు షాద్‌నగర్‌లో కలుసుకుని అన్నారం భూ వ్యవహారంపై చర్చించారు. కాసేపటి తర్వాత తనకు పనుందని, సాయంత్రం మళ్లీ కలుసుకుందామని చెప్పి రాంచంద్రారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సాయంత్రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో మరో వ్యక్తితో కలిసి రాంచంద్రారెడ్డిని ప్రతాప్‌రెడ్డి కారులో తీసుకెళ్లాడు. అనంతరం కారులో దారుణంగా పొడిచి చంపాడు. హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్న ప్రతాప్‌రెడ్డి వెంట కత్తి తెచ్చుకున్నట్టు అనుమానిస్తున్నారు.

ప్రతాప్‌రెడ్డి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, పలువురి నుంచి డబ్బులు తీసుకున్న ఆయన శుక్రవారం వాటిని చెల్లిస్తానని మాటిచ్చాడని తెలుస్తోంది. ఈ క్రమంలో భూ వ్యవహారానికి సంబంధించి రూ. కోట్లలో డబ్బులు ఇస్తానన్న రాంచంద్రారెడ్డి సాగదీత ధోరణి కొనసాగించడంతోనే ఈ హత్య చేసినట్టు చెబుతున్నారు. హత్యకు పాల్పడిన నిందితులు ఇద్దరూ పోలీసులకు లొంగిపోయినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇంకెవరి ప్రోత్సాహమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News