Mukesh Ambani: బ్లూంబెర్గ్ ప్రపంచ కుబేరుల టాప్ -10 జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం

Mukesh Ambani gets a place in Bloomberg Billionaires Index
  • టాప్-10లో నిలిచిన ముఖేశ్
  • రిలయన్స్ అధినేతకు 9వ స్థానం
  • కరోనా నేపథ్యంలోనూ వ్యాపార దక్షత
  • జియో ప్లాట్ ఫామ్స్ కు పెట్టుబడుల వెల్లువ
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేశ్ అంబానీ ప్రాభవం మరింత పెరిగింది. ప్రపంచ ప్రఖ్యాత బ్లూంబెర్గ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేశ్ అంబానీకి కూడా స్థానం లభించింది. ఈ బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ టాప్-10 జాబితాలో ముఖేశ్ కు 9వ స్థానం దక్కింది. ఆయన నికర సంపదను 64.5 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలోకెక్కే క్రమంలో ఆయన ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, ఫ్రాన్స్ కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ లను అధిగమించారు.

యావత్ ప్రపంచం కరోనాతో కుదేలవుతున్నా గానీ, ఆయన జియో ప్లాట్ ఫామ్స్ లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. రిలయన్స్ లో 42 శాతం వాటాలు ఉన్న ముఖేశ్ అంబానీ ఇటీవల పెట్టుబడుల పుణ్యమా అని జియో ప్లాట్ ఫామ్స్ ను రుణరహిత సంస్థగా మార్చేశారు. ప్రపంచ దేశాల్లో కరోనా తీవ్రత మొదలయ్యేనాటికే మార్చి త్రైమాసికంలో రిలయన్స్ సామ్రాజ్యంలోని చమురు, టెలికాం, ఇతర సంస్థల షేర్ల విలువ రెట్టింపైంది.

మరోవైపు, బ్లూంబెర్గ్ జాబితాలో ఉన్న కుబేరులు కరోనా దెబ్బకు కకావికలం అయినా, ఆ ప్రభావం రిలయన్స్ పై పెద్దగా పడలేదు. ఇక ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్ బుక్) ఉన్నారు.
Mukesh Ambani
Bloomberg Billionaires Index
Reliance
Jio
India

More Telugu News