Vasireddy Padma: ఆఫ్టరాల్ మీది ప్రతిపక్షం, మీకిచ్చింది 23 సీట్లు!: టీడీపీపై నిప్పులు చెరిగిన వాసిరెడ్డి పద్మ

  • అయ్యన్న ఉదంతాన్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుందని వెల్లడి
  • అయ్యన్నపాత్రుడ్ని అరెస్ట్ చేయిస్తామంటూ వ్యాఖ్యలు
  • రాజకీయ రంగు పులుముతున్నారంటూ ఆగ్రహం
Vasireddy Padma fires on TDP and Ayyanna Patrudu

నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని అసభ్యంగా దూషించారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ అక్రమ కేసులు బనాయిస్తోందంటూ టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. చట్టం అంటే లెక్కలేని విధంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వ అధికారిణితో అవమానకరంగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి, గవర్నర్ కు ఫిర్యాదు చేశారని మండిపడ్డారు.

"ఇలాంటి ఘటనలకు రాజకీయ రంగు పులుముతున్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఇతర చిన్న ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లకు ఏమీ సత్తా లేదనుకుంటున్నారా? మీ రాజకీయ క్రీడలకు వీళ్లు బలవ్వాలా? అయ్యన్నపాత్రుడ్ని ఒక్కమాట అంటే ఇదే చంద్రబాబు, లోకేశ్ ఊరుకుంటారా? మహిళా అధికారులు ఇలాంటి వాళ్ల ముందు ఎందుకు తలదించాలి? ఇలాంటి మాటలు ఎందుకు భరించాలి? ఆఫ్టరాల్ మీది ప్రతిపక్షం, ప్రజలు మీకిచ్చింది 23 స్థానాలు. ఇంత తక్కువ ప్రజాదరణ ఉన్నప్పుడే మీరు ఇంత అహంకారం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోం. ఈ ఘటనను రాజకీయం చేసి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేది లేదు. మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ ఘటనను ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంటుంది. అయ్యన్నను అరెస్ట్ చేయిస్తాం" అంటూ స్పష్టం చేశారు.

More Telugu News