శాసనసభలోనే అంతిమ నిర్ణయాలు జరుగుతాయి... మండలి నిర్ణయాలు పట్టించుకోనవసరం లేదు: తమ్మినేని సీతారాం

20-06-2020 Sat 16:52
  • టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్న స్పీకర్
  • ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని విమర్శలు
  • రాజమహేంద్రవరంలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన తమ్మినేని
Speaker Tammineni Sitaram says assembly decision will be ultimate anywhere
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి అధిక బలం ఉండగా, శాసనమండలిలో మాత్రం టీడీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. దీనిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు. శాసనసభ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులతో ఏర్పడుతుందని, అంతిమ నిర్ణయాలు అక్కడే జరుగుతాయని స్పష్టం చేశారు. మండలిలో జరిగే నిర్ణయాలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇది వర్తిస్తుందని తెలిపారు.

శాసనమండలిలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం విపక్షానికి ఇష్టం లేదా? అని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.