Ashok Babu: రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి ఒక్కడు చాలు... వాపును బలుపు అనుకోవద్దు: అశోక్ బాబు

  • ఎన్నికల్లో సీట్లు రావడం అనేది ప్రజల తీర్పు అని వెల్లడి
  • విపక్షమే లేకుండా చేస్తామనడం అర్థరహితమంటూ వ్యాఖ్యలు
  • ఎన్టీఆర్ 9 నెలల్లో రాజకీయాన్ని మార్చేశాడని వివరణ
TDP MLC Ashok Babu slams YSRCP leaders

ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పందించారు. రుతుపవనాలు కాస్త ఆలస్యమయ్యాయేమో కానీ, ఏపీలో మాత్రం రాజకీయ పవనాలు జోరుగా వీస్తున్నాయని అన్నారు. వైసీపీకి ఎన్నికల్లో 151, టీడీపీకి 23 వచ్చాయని అది ప్రజల తీర్పు అని తెలిపారు. అయితే, ఇప్పుడు ప్రతిపక్షమే లేకుండా చేస్తామని అంటున్నారు, అదెలాగ! అంటూ అశోక్ బాబు ప్రశ్నించారు.

"భారతంలో కర్ణుడ్ని చూపించడం వల్లే అర్జునుడి గొప్పదనం అందరికీ అర్థమైంది. ఓ పెద్ద గీత పక్కన చిన్న గీత ఉంటేనే పెద్ద గీత విలువ అంచనా వేయగలం. చట్టసభల్లో ప్రతిపక్షం ఉండి, ఆ ప్రతిపక్షాన్ని కూడా ఒప్పించేలా వ్యవహరించినప్పుడే ఆ అధికార పక్షం గొప్పతనం తెలుస్తుంది. సీట్లు వచ్చినంత మాత్రాన గొప్పకాదు. సీట్లు వచ్చింది పరిపాలించడానికి. రాజకీయంగా గొప్పవాడివి కావాలంటే ప్రతిపక్షాన్ని కూడా నెగ్గుకు రాగలిగినప్పుడే వీలవుతుంది. ప్రతిపక్షమే లేకుండా చేస్తానని చెబుతూ మీరెలా గొప్పవాళ్లనిపించుకుంటారు? మాకు 151 సీట్లు వచ్చాయంటూ కొందరు ఎమ్మెల్యేలు ఉదయం, సాయంత్రం గాయత్రీజపంలా చేస్తున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ వాళ్లకు 174 సీట్లు వచ్చినా, ప్రజల్లో చైతన్యం వచ్చిననాడు ఏదీ పనిచేయదని అన్నారు. సీట్ల బలం ఉంది కదా అని చెప్పి, ఇష్టం వచ్చినట్టు బిల్లులు పెట్టుకుని ఆమోదింపచేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏదో విచిత్రం జరుగుతుందని, టీడీపీ గెలుస్తుందని భావించి తాము పోటీ చేయలేదని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగానే పాల్గొన్నామని, తద్వారా పార్టీ ఉనికిని చాటుకోవడమే కాకుండా, పార్టీ శ్రేణులను కాపాడుకోవడం కోసం ఎన్నికల్లో పాల్గొన్నట్టు వెల్లడించారు.

టీడీపీకి 23 సీట్లు వచ్చాయని హేళన చేస్తున్నారని, కానీ ఒక్కడు చాలు పరిస్థితి మార్చడానికి అంటూ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. గతంలో ఎన్టీఆర్ ఒక్కడే తొమ్మిది నెలల్లో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశాడని తెలిపారు. ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చాయని వైసీపీ వాళ్లు వాపును బలుపు అనుకోవద్దని హితవు పలికారు.

More Telugu News