Maharashtra: 43 ఏళ్ల తరువాత సొంత ఇంటికి చేరుకున్న బామ్మ!

  • మహారాష్ట్రలో ఘటన
  • 43 ఏళ్ల నుంచి నూర్ ఖాన్‌ ఇంట్లో వృద్ధురాలు
  • ఖాన్ చనిపోవడంతో ఆమెను సొంతింటికి చేర్చాలనుకున్న అతడి కుమారుడు 
  • ఆమె చెప్పిన అడ్రస్‌ గూగుల్‌ మ్యాప్‌లో రికార్డు
  • గ్రామ అధికారి ఫోను నంబరు తెలుసుకుని ఇంటికి తరలింపు
women reaches home after 43 years

అనుకోకుండా 43 ఏళ్ల క్రితం కుటుంబానికి దూరమైన పంచుబాయ్‌ అనే ఓ వృద్ధురాలు (90) తాజాగా గూగుల్ మ్యాప్‌లోని ఫీచర్ల సాయంతో ఇంటికి చేరుకుంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో 43 ఏళ్ల క్రితం ఒంటరిగా కనిపించిన ఆమెను చూసిన నూర్‌ ఖాన్‌ అనే వ్యక్తి, ఆమెను వివరాలు అడిగితే ఏమీ చెప్పకపోవడంతో, తన స్వగ్రామమైన తాల గ్రామానికి తీసుకెళ్లాడు.

తర్వాత ఎన్నిసార్లు తన వివరాలు అడిగినా ఆమె చెప్పలేదు. దాంతో ఆమెకు అచ్చన్‌ అని పేరు పెట్టి ఇన్నేళ్లు ఆయనే చూసుకున్నాడు. అయితే, కొన్నాళ్ల క్రితం నూర్‌ ఖాన్‌ మృతి చెందాడు. దీంతో పంచుబాయ్‌ని నూర్‌ ఖాన్‌ కుమారుడు ఇష్రార్ ఖాన్‌ ఆమె ఊరు, తదితర వివరాలు అడిగాడు.

అయితే, ఆమె ఏదో చెప్పింది కానీ, అతడికి అంతగా అర్థం కాలేదు. దాంతో గూగుల్‌ మ్యాప్‌ తెరిచి ఆమె చెప్పిన పదాల్ని రికార్డు చేసి సెర్చ్‌ చేశాడు. దీంతో ఆమెది కంజమ్‌ నగర్‌ అని అతడికి తెలిసింది. గూగుల్‌లోనే ఆ గ్రామ అధికారి ఫోన్‌ నంబర్‌ను గుర్తించాడు. అనంతరం వాట్సప్‌ ద్వారా పంచుబాయి ఫొటోను పంపాడు. దీంతో ఆ గ్రామంలోని వారు ఆమెను గుర్తు పట్టారు.

విషయం తెలుసుకున్న ఆమె మనవడు పృథ్వీరాజ్ షిండే వెంటనే ఇష్రార్ ఖాన్ ను సంప్రదించి నానమ్మను ఇంటికి తెచ్చుకున్నాడు. అనుకోకుండా ఆమె ఇంటి నుంచి తప్పిపోయిందనీ, ఆమె కోసం అప్పట్లో ఎంతగానో వెదికారనీ, ఆమె కోసం ఎదురుచూసిన తన తాత, తన తండ్రీ కూడా మరణించారని షిండే చెప్పాడు.

More Telugu News