'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు ఇయాన్ హోల్మ్ కన్నుమూత!

20-06-2020 Sat 11:22
  • కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధి
  • ఆసుపత్రిలో కన్నుమూసిన ఇయాన్
  • సంతాపం తెలిపిన హాలీవుడ్
Lord of Rings Fame Iam Holm Dies at 88
ఆస్కార్ నామినేటెడ్ బ్రిటన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, సూపర్ హిట్ అయిన 'లార్డ్ ఆఫ్ రింగ్స్',' ఏలియన్' చిత్రాల నటుడు ఇయాన్ హోల్మ్ కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. 1981లో వచ్చిన చారియట్స్ ఆఫ్ ఫైర్ చిత్రానికి గాను ఆయన ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇదే చిత్రానికి గాను ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ సహాయ నటుడి అవార్డును అందుకున్నారు. 'ది మ్యాడ్ నెస్ ఆఫ్ కింగ్ జార్జ్', 'ది ఏవియేటర్', 'ది డే ఆఫ్టర్ టుమారో', 'ది ఫిఫ్త్ ఎలిమెంట్' తదితర చిత్రాల్లో తన నటనకు విమర్శల ప్రశంసలను ఇయాన్ అందుకున్నారు.

ఆయన చివరిగా 2014లో వచ్చిన 'ది హాబిట్: ది బ్యాటిల్ ఆఫ్ ది ఫైవ్ ఆర్మీస్' చిత్రంలో కనిపించారు. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో ఆయన బాధపడుతూ కన్నుమూశారని ఆయన ప్రతినిధి వెల్లడించారు. ఆసుపత్రిలో కుటుంబీకులందరి మధ్యా ప్రశాంతంగా ఆయన తుది శ్వాసను విడిచారని చెప్పారు. ఇయాన్ మరణం హాలీవుడ్ కు తీరని లోటని పలువురు నటీ నటులు సంతాపాన్ని వెల్లడించారు.