International Day: రేపు యోగా డే, ఫాదర్స్ డేతో పాటు మొత్తం 'సెవెన్ డేస్'!

  • షేక్ హ్యాండ్ డే, మ్యూజిక్ డే కూడా రేపే
  • మానవత్వ, జల దినోత్సవాలు కూడా
  • యువత జరుపుకునే టీ షర్ట్ డే కూడా ఆదివారమే
Total 7 Days Tomorrow

ఆదివారం, జూన్ 21... ఈ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. రేపు ఒక్కరోజే ఏడు 'డే'లు రానున్నాయి. వీటిల్లో ప్రపంచం నాశనమవుతుందన్న డూమ్స్ డే కూడా ఉంది. దీని గురించి పక్కన బెట్టి, మిగతా ఏ దినోత్సవాలు జరుగుతాయో ఓ సారి పరిశీలిస్తే...

యోగా దినోత్సవం:2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన తరువాత ప్రతి సంవత్సరం జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా జరుపుకోవాలని ఐరాస నిర్ణయించింది. ఏడాదిలో పగటి సమయం అత్యధికంగా ఉండేది నేడు, రేపు, ఎల్లుండి మాత్రమే. ఆపై పగటి సమయం తగ్గుదల ప్రారంభమవుతుంది. ఈ మూడు రోజుల మధ్య రోజును యోగా దినోత్సవంగా జరుపుకోవాలని మోదీ నిర్ణయించారు.

షేక్ హ్యాండ్ డే: ఆదివారం నాడు కరచాలన దినోత్సవం జరిగే అవకాశాలు లేవు. కరోనా మహమ్మారి కారణంగా భౌతిక దూరం తప్పనిసరైన నేపథ్యంలో, కొన్నేళ్ల పాటు షేక్ హ్యాండ్ డే నిర్వహించుకునే అవకాశాలు లేవనే చెప్పాలి. అన్నట్టు ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు.

సంగీత దినోత్సవం: వరల్డ్ మ్యూజిక్ డేను కూడా రేపు జరుపుకోనున్నారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 1982లో ఇది ప్రారంభమైంది. ప్రస్తుతం 120 దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్, అదే దేశానికి చెందిన సంగీత కళాకారుడు ఫ్లూ హెమోవిస్ మ్యూజిక్ డేను ప్రారంభించారు.

ప్రపంచ మానవత్వ దినోత్సవం: ఇదే రోజున వరల్డ్ హ్యూమనిస్ట్ డే కూడా జరుగనుంది. ప్రజల్లో మానవత్వ పోకడలను పెంచేలా 1980 నుంచి మానవత్వ దినోత్సవం జరుగుతోంది. ఎన్నో దేశాల్లోని మానవ హక్కుల సంస్థలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

జల దినోత్సవం: వరల్డ్ హైడ్రోగ్రఫీ డే కూడా రేపు జరుగనుంది. జల వనరుల అభివృద్ధికి ప్రజలను కట్టుబడివుండేలా చేసేందుకు హైడ్రోగ్రఫీ డే, 2005 జూన్ 21 నుంచి ప్రారంభమైంది. ఐరాస కూడా దీన్ని గుర్తించింది.

ఫాదర్స్ డే: నాన్నల దినోత్సవం. వాస్తవానికి ఫాదర్స్ డే ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారంలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మూడో ఆదివారం జూన్ 21న వచ్చింది. కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడే తండ్రిని గౌరవించుకునేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అన్నట్టు మదర్స్ డే మే నెలలో రెండో ఆదివారం వస్తుందన్న సంగతి తెలిసిందే.

టీ షర్ట్ డే: వీటన్నింటితో పాటు టీ షర్ట్ దినోత్సవం కూడా రేపు జరుగనుంది. టీ షర్ట్ డేను పాటించడంలో సంఘ హితం ఏమీ లేకున్నా, 2008లో ఓ జర్మనీ దుస్తుల సంస్థ దీన్ని ప్రారంభించింది. యువత దీన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కొన్ని దేశాల్లో టీ షర్ట్ డే ఓ ఉత్సవంలా కూడా జరుగుతుంది.

More Telugu News