సూపర్ స్టార్ రావడం కాస్త లేటవుతుందట!

19-06-2020 Fri 14:02
  • తెలుగునాట కూడా రజనీకాంత్ కు అభిమానులు 
  • శివ దర్శకత్వంలో రజనీ హీరోగా 'అన్నాత్తే'
  • సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లానింగ్
  • లాక్ డౌన్ కారణంగా వేసవికి విడుదల  
Rajanikanth film not releasing for Pongal
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమా చేస్తున్నాడంటే ఇక అభిమానులకు పండగే. ఇక అది ఎప్పుడు థియేటర్ కి వస్తుందా? అంటూ ఎదురుచూస్తూ వుంటారు. అలాంటి అభిమానులు కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు నాట కూడా రజనీకి వున్నారు.

ఇక తాజాగా ఆయన శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' (అన్నయ్య) అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో ఆయన సరసన ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు మొదట్లో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ ప్లాన్ చేశారు.

అయితే, అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో చిత్ర నిర్మాణంలో ఆలస్యం అవుతోంది. ఇంకా ఏభై శాతం చిత్రీకరణ మిగిలివుందట. రజనీ అప్పుడే షూటింగులో పాల్గొనేలా కూడా లేరు. షూటింగ్ మొదలెట్టడానికి మరో రెండు నెలలైనా పట్టచ్చు. దీంతో సంక్రాంతికి దీనిని విడుదల చేయడం కష్టమేనని అంటున్నారు. ఇక వేసవికే ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకోవాలి. రజనీ అభిమానులకు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే!