Nitya Menon: దర్శకత్వానికి స్క్రిప్టు సిద్ధం చేసుకున్న హీరోయిన్!

  • కథానాయికగా నిత్యా మీనన్ ప్రత్యేకత 
  • పాత్ర నచ్చితేనే సినిమాకి గ్రీన్ సిగ్నల్
  • దర్శకత్వంపై మక్కువ పడిన ముద్దుగుమ్మ 
  • 2022లో మెగాఫోన్ పట్టనున్న నిత్య 
Nitya Menon to direct a movie

నిత్యా మీనన్ మంచి నటి. టాలెంట్ వున్న కొద్దిమంది మన హీరోయిన్లలో ఆమె ఒకరు. అందుకే తను చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె తక్కువ సినిమాలు చేయడానికి కూడా ఓ కారణముంది. అదేమిటంటే, ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది ఒప్పేసుకోదు. కథ, అందులోని తన పాత్ర తనకు బాగా నచ్చితేనే ఒప్పుకుంటుంది. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడదు. అందుకే, తను వచ్చి ఇన్నేళ్లయినా చేసింది తక్కువ సినిమాలే!

ఇక నటన కాకుండా సినిమా రంగంలో ఆమెకు దర్శకత్వం అంటే మహా ఇష్టం. అందుకే, షూటింగులో తన సీన్స్ లేనప్పుడు.. కెమెరా వెనుక నిలబడి చిత్రీకరణ తీరును ఆమె పరిశీలిస్తూ వుంటుంది. ఈ అభిరుచితోనే దర్శకురాలు కావాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా ఈ లాక్ డౌన్ కాలంలో కొన్ని స్క్రిప్టులు సిద్ధం చేసుకుందట.

ప్రస్తుతం వివిధ భాషల్లో తను కమిట్ అయిన చిత్రాలను వచ్చే ఏడాదిలోగా పూర్తిచేసేసి, 2022లో తప్పకుండా మెగా ఫోన్ పట్టుకోవాలన్నది ఈ ముద్దుగుమ్మ కోరిక. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటోందట!    

More Telugu News