NPP: షాకిచ్చిన ఎన్పీపీ... పడిపోనున్న మణిపూర్ బీజేపీ సర్కార్!

  • 2017లో చిన్న పార్టీలను కలుపుకుని మణిపూర్ లో ప్రభుత్వం
  • రాజీనామా చేసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు
  • నేడు గవర్నర్ ను కలవనున్న కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్
NPP shock to BJP in Manipur

విపక్ష పార్టీల నేతృత్వంలో పలు రాష్ట్రాల్లో నడుస్తున్న ప్రభుత్వాలను పడగొడుతున్న బీజేపీకి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణానికి మద్దతిస్తున్న అంత్యంత కీలకమైన ఎన్పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ) షాకిచ్చింది. బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరిస్తున్నామని చెబుతూ, ప్రభుత్వంలోని తమ నలుగురు మంత్రుల చేత రాజీనామా చేయించింది. వీరిలో డిప్యూటీ సీఎం జోయ్ కుమార్ సింగ్ కూడా ఉండటం గమనార్హం.

ఇదే సమయంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు. దెబ్బ మీద దెబ్బలా బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేయడంతో ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితి ఏర్పడింది. తిరుగుబావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు.

ఊహించని ఈ పరిణామాలతో కంగుతిన్న బీజేపీ, రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మణిపూర్ లో అధికారాన్ని కోల్పోకుండా ఉండేందుకు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. కాగా, 2017లో మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా, మొత్తం 60 స్థానాల్లో 28 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించినా, 21 స్థానాలు గెలిచిన బీజేపీ, ఇతర పార్టీల సాయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తాజా రాజీనామాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 19కి పడిపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు అవకాశాలు పెరిగాయి. తక్షణమే అసెంబ్లీలో బల నిరూపణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత ఇబోబీ సింగ్ నేడు గవర్నర్ తో భేటీ కానున్నారని సమాచారం. విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఆయన గవర్నర్ ను కోరనున్నారని తెలుస్తోంది.

More Telugu News